10 July 2020
అనన్య చురకలు !
3 July 2020
బొమ్మాలి....
నేను : Salary కూడా ఈ month నుండి పెరుగుతుందా?
ప్రమోద్ : ఛ,experience కోసం ఆ రోల్ ...ఎక్కువ ఉహించుకోకు ...IT లో ఎప్పటినుండి ఉంటున్నావ్ తల్లే
నేను : సర్లే ..ఎదో ఒకటి ఇవ్వు.. వెలగబెడతా ..
ప్రమోద్ : నీ పాత టీం అంతా continue అవుతుంది ... ఒక్క పిల్ల కొత్తమ్మాయి ...
నేను :ఎవరు ?
ప్రమోద్ : ఎవరో..నాకు తెలీదు ...రేపు వస్తుంది ...
ఆ పిల్ల రావాడం ..నా గుండెలో ధడ మొదలవడం రెండూ ఒకే సారి జరిగాయి.. sixth sense అంటే ఏంటో ఆ రోజే అర్థం అయ్యింది
మొత్తం టీం అంతా అమ్మలక్కలే ..వీళ్ళకి నేను మేనేజర్ ..అర్థమైపోయింది నా పరిస్తతి
రోజుకో గొడవ
డాక్యుమెంట్ లో ఫాంట్ సైజు కరెక్ట్ చేయలేదని ..భోజనానికి వెళ్ళేటప్పుడు పర్మిషన్ తీసుకోలేదని ... మెయిల్ లో full stop లు కామాలు సరిగ్గాలేవని ..ఇలా ...రోజుకొకటి...
బాబోయ్ అసలే బెంగుళూరు సిటీ బస్సు లో ఆఫీస్ కి వెళ్లేదాన్నేమో.. అక్కడ అరుపులు ఇక్కడ అరుపులు సమానంగా ఉండేవి...సాయంత్రం అయ్యేసరికి మెంటలొచ్చేసేది ..పనయ్యేది కాదు ... ఇంటికి వెళ్లి ఆ పని నేను ఎవరికీ చెప్పుకోలేక .. నేనే చేస్కునేదాన్ని ...
ఇలా ఉండగా ... దేవుడి లా వెంకట్ వచ్చాడు ...వెంకట్ ఎవరంటే ...సీనియర్ మేనేజర్ ...ఏ పని లేక తిరుగుతున్నాడుట......బెంచ్ లో ఉంటే కష్టం అని మా ప్రాజెక్ట్ లో కి తోసారు .. అప్పుడు ప్రమోద్ వచ్చి చెప్పాడు.. ఇతను నీకు హెల్ప్ చేస్తాడు ..నువ్వు టీం కి హెల్ప్ చెయ్యి అని ...తిరిగి మన రోల్ మనకు వచ్చేసింది అని అర్థమైంది ..అసలు వర్క్ చేసుకోడం ...దీనంత ప్రశాంతత ఇంకోటి లేదు ... వెంకట్ సీనియర్ మేనేజర్ కదా ...మనకంటే రెండు లెవెల్స్ ఎక్కువ లో ఉన్నాడు ..నోరు జాగ్రత్త గా ఉండాలి అనుకున్నా.. అక్కర్లేదని అతనితో మాట్లాడిన ఒక 10 నిమిషాలకి తెలిసిపోయింది ...
మొత్తం ప్రాజెక్ట్ గురించి explian చేసాక ... team గురించి టాపిక్ వచ్చింది.. ఇక్కడ వద్దు లే అన్నాను..
సరే కాఫీ కి వెళ్దాం పదా అన్నాడు ... కాఫీ ఆర్డర్ ఇస్తూ ..హే team లో అందరూ ఓకే కానీ ..ఆ బొమ్మాలి డేంజర్ లా ఉంది అన్నాడు ..అరే భలే క్యాచ్ చేసావే అనుకుంటూ ...బొమ్మాలి ఎవరు అన్నాను ..అదే ఆ పిల్లే ప్రియా ,నీకు తెల్సులే అన్నాడు :D ... నవ్వుకున్నాం
కానీ ఆ అమ్మాయి ఒక్కటే కొంచెం తేడా ... ఎలా చెప్పినా వినదు పని చేయదు ... ఇలాంటి వాళ్ళని ఎంత మందిని హేండిల్ చేయలేదు అన్నాడు ...F2 లో వెంకటేష్ లాగా...
అవును నేను కూడా ఇలాంటి గైడెన్స్ కోసమే ఎదురు చూస్తున్నా ...ఏం చేయాలి వెంకట్?
ఫ్రెండ్లీ గా ఉండు ... ఉంటున్నాను .. రేస్ గుర్రం లో శృతిహాసన్ లా
లంచ్ కి బ్రేక్ కి ఆ పిల్లతో వెళ్ళు
ఆ పిల్లవి పాకిస్తాన్ టైం ..నేను టపా కడతా ..
ఎహె ఒక రోజు లేట్ గా తింటే ఏం పోవు.. అయినా నీకు గాలి చాలు ...
టీం కూడా కలవరు ...మన సీతక్క అసలు కలవదు ..
.సీతక్క తో match fixing చేసుకుందాం లే ..అన్నాడు
సీతక్క అంటే మా టెక్నికల్ లీడ్ ... ఆ పిల్లకి తెలివి చాదస్తం రెండూ ఎక్కువే ... ఓవర్ perfectionist
next డే అందరం కలిసి వెళ్ళాం .. భోజనానికి వెళ్లినట్టు లేదు ఎదో సంతాప సభ కి వెళ్లినట్టు ఉంది
కిరణ్ ఇలా వర్క్ అవ్వదు ... ఎవరూ లేకుండా ..టీ కి మనం ముగ్గురం వెళ్దాం.. mental or personal issues ఉన్నాయేమో కనుక్కుందాం ...
ప్రియా - విల్ యూ కం ఫర్ టీ ?
నో వెంకట్ నేను బిజీ అంది (వెంకట్ ఇన్నర్ వాయిస్ నాకు వినిపించింది )
నో ప్లీజ్ కం ..give company for us ..అన్నాడు ... వచ్చింది ..
దారిలో అడిగా .. నువ్వాపిల్లకు లైన్ వేస్తున్నావా అని
అమ్మ తల్లీ ...ఇద్దరు పిల్లలు ... ఒక పెళ్ళాం ..చింత లేని చిట్టి కుటుంబం ... నన్నొదిలెయ్ అన్నాడు...
సర్లే ..పద ... అని కాఫీ ఆర్డర్ చేసుకున్నాం ఇద్దరికి ...బొమ్మాలి ఏమో ... వెంకట్ ...ఆర్డర్ some fruit juice to me అనింది
..వెంకట్ నా వైపు చూసి ఎదో achieve చేసినట్టు ఫీల్ అయ్యాడు ...
సీట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు .. హే ప్రియా ..ఆ 2 డాకుమెంట్స్ ఈ రోజు పంపించవా అన్నాడు..
నో వెంకట్ ..I will leave at 4... my kid will reach home by then ... career is not that important అని బాగ్ సర్దుకుని వెళ్ళిపోయింది
కిరణ్ .. నాకు ఒకటి అర్థం కావాలి -- ఆ పిల్ల 12 కి వచ్చింది - 1 to 2 లంచ్ చేసింది ..2-3 ..డాకుమెంట్స్ చూస్తూ ఫోన్ మాట్లాడింది .. 3-30 మనతో కాఫీ కి వచ్చింది ..ఇప్పుడు ఇంటికి వెళ్తుంది .. exactly ఇదే వెంకట్ ఎవరీ డే...
ఓకే ..లైట్ తీస్కో .. కొత్త resource ని అడుగు ..ఈ పిల్లకి పర్సనల్ issues ఏమో అనుకున్నాను ...కాదు పిల్లే ఇష్యూ వద్దు అన్నాడు
next day friday
నేను ,వెంకట్, బొమ్మాలి మాత్రమే ఆఫీస్ కి వచ్చాం .. లంచ్ కి వెళ్తూ వెంకట్ ఆ పిల్లని పిలిచాడు
వెళ్లి తాను ఫుడ్ order తెచ్చుకుంటున్నాడు ..మాకు కూడా పకోడీ తెస్తున్నాడు ...
మొత్తానికి ఏవేవో discussions లోకి వెళ్ళాం ...చావు..దయ్యాలు దగ్గర టాపిక్ ఆగింది ...
వెంకట్ ఇంకా ఏవేవో తవ్వుతున్నాడు ..ఆ పిల్ల నీకు తెల్సా నాకు దయ్యాలు కనిపిస్తాయి అనింది
నవ్వాడు
Be Serious..I don't joke like you people అంది
అంటే అన్నాం ?
i see them seriously అనింది..
ఎలా అన్నాం భయపడుతూ ...
మాట్లాడతారు ... వాళ్ళు చెప్పాలి అనుకున్నవి చెప్తారు ... ఇంట్లో ఎవరు లేనప్పుడు వస్తారు ..అనింది
నాకూ వెంకట్ కి వణుకు ...మిట్ట మధ్యాహ్నం ... ఎదో చీకట్లో దయ్యాల మధ్య ఉన్న ఫీలింగ్ ...
ఫైనల్ గా ఆ పిల్ల ఎదో చెప్తుంటే ...నేను ... కలలో వస్తారు అంటారు ?అలాగా అన్నా
యా exactly ..but i will feel them అనింది .. ఒకే సరి నేనూ వెంకట్ ..ఫీల్ ఫీల్ ... we have a call now ani వెనిక్కి చూడకుండా పరిగెట్టాం ...
ఇంకో friday ..నేను వెంకట్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాను ...బొమ్మాలి ని పిలవకు అని.. బుద్దుందా ఎవడన్నా పిలుస్తాడా అన్నాడు .. మేము వెళ్తుంటే ..can I join అంది ... ఏడుస్తూ ఓకే అన్నాం ..
ఈ సారి టాపిక్ .. "సీక్రెట్" బుక్ ..
చాలా బాగుంటుంది అంది బొమ్మాలి .. ఏంటి కాన్సెప్ట్ అన్నాను ...
basically what ever you think constantly ,will become true అని intro ఇచ్చింది ...
అంటే అన్నాడు ..
నువ్వు దేని గురించి ఎక్కువ ఆలోచిస్తుంటావ్ అని అడిగింది ..
చాల సేపు అలోచించి ..ఏం లేదు అన్నాడు .. మనిషన్నాకా dreams ఉంటాయి గా అంది ...
ఓహ్ ప్రూవ్ చేసుకోవాలా అని ... ఒక bungalow కొనుక్కుని అప్పుల పాలు అయిపోతానని కల వస్తూ ఉంటుంది ...తప్పకుండా అవుతుంది అలాగే అంటూ అక్కడ నుండి ఫోన్ వచ్చిందని లేచి వెళ్ళిపోయింది ...
పాపం వెంకట్ ...షాక్ లో ఉండి పోయాడు ...
వెంకట్ లైట్... తిను ... ఏం కాదు లే అని టాపిక్ divert చేశాను
మళ్ళీ friday వస్తోందంటే భయం ... ఇలా కొన్ని friday లు చాలా గందరగోళంగా ఉండేవి ...
ఇంక ఆ అమ్మాయి ప్రాజెక్ట్ నుండి వెళ్లిపోయే రోజు మేము పార్టీ చేసుకున్నాం
పాపం ఆలా వెంకట్ నాకు మానేజ్మెంట్ పాఠాలు నేర్పిద్దాం అనుకుని ..తానే జీవిత పాఠాలు నేర్చుకున్నాడు ..
25 June 2020
ఒక మంచి భర్త ... ఒక పిచ్చ భార్య!
"అలాగేనండి"
"మొన్న స్నాక్స్ తీసుకు వచ్చాను కదా అది ఒక కప్పులో పెట్టావా"
"అలాగేనండి"
"ఓయ్ జన్మ జన్మకి నువ్వే నా భార్య కావాలి"
"నిజంగానా అండి" (ఆశ్చర్యం తో )
"అవునే ..నన్ను confuse చేయకు"
"నీకూ అలాగే అనిపిస్తోందా నేనే భర్త గా కావాలని?"
"అవును అనుకోండి కానీ ఇలా అరేంజ్డ్ మ్యారేజ్ కాదండీ .. లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం"
"నిజమే బోర్ కొడుతోంది నాకు కూడా ఎవరినైనా లవ్ చేయాలనిపిస్తుంది"
"ఏంటీ ????"
"ఆ ..కాదు కాదు అదే నిన్నే మళ్ళీ మళ్ళీ లవ్ చేయాలనిపిస్తుంది"
"అవును కదండీ ... ఎక్కడున్నా కలిసి ప్రేమించుకునే నెమ్మదిగా పెళ్లి చేసుకుందాం అండి వచ్ఛే జన్మ లో "
"ఎలా ప్రేమించుకుందాం"
"సినిమాలో లాగా చక్కగా రొమాన్స్.... వెయిటింగ్ లు.. గ్రీటింగ్ కార్డులు... ట్యాంక్ బండ్ మీద షికారు ...సినిమాలు .. ఇలా తిరిగి తిరిగి ప్రేమించుకుందాం అండి"
"అవును సరే అలాగే ప్లాన్ చేసుకుందాం లే వచ్చే జన్మలో"
"ఏంటిది ఇలా మారిపోయాడు ఈయన" అనుకుంటున్నంత లోనే
"పిచ్చి గాని పట్టిందా ఏమిటి శాస్త్రబద్ధంగా పెద్దలు కుదిర్చిన పెళ్లి ... నువ్వే నా భార్య నేనే నీ భర్త... నెక్స్ట్ జన్మ కాదు ఎన్ని జన్మలైనా సరే..
Love అంటే లవ్వు తొక్కలో లవ్వు ... లవ్వు కాదది కొవ్వు ... లవ్ చేయాలంట... నీ మొహం... పిచ్చ కోరిక లు.. నువ్వూనూ !"
దేవుడా ఈ ఒక్క జన్మకే కాదు ఇంకో కొన్ని జన్మల నా ఆటోబయోగ్రఫీ నాకు చూపించేసావ్
ఈమధ్య మోక్షం ప్రసాదించమని ఏ శిష్యుడు నన్ను అడగట్లేదు అని ఓ గురువు వాపోయారు
నేను ... నేను ... అడుగుతున్నా ఈ జీవితం తో మోక్షం ప్రసాదించెయ్ స్వామీ ... అనుకుంది పిచ్చి భార్య
16 August 2017
ఫిదా కి ఫిదా
మీకే ?? బానే ఉంటారు !! ..
మా పరిస్థితే ఏమి బాలేదు..
ఏం చెప్పమంటారు .??
మాది ఒక సాఫ్ట్వేర్ జంట .. చి ఛి .. ఏమన్నా ఇంట్రడక్షన్ ఆ..
ఆన్ని వైపుల నుండి వచ్ఛే స్ట్రెస్ తట్టుకోలేక మా మిడిల్ క్లాస్ ఫామిలీస్ సినిమాలకి వెళ్తూ ఉంటాం ..మర్చిపొతూ ఉంటాం ..
కానీ దీన్ని అలా మర్చిపోలేక పొతున్నా...
సర్ .. ఫామిలీ ఫామిలీ సినిమా కి వెళ్లాం ..పిల్ల జల్ల..అత్త ..మామ
భానుమతి సింగల్ పీస్ అని అరుస్తున్నప్పుడు ..నేను ఈల వేద్దాం అంటే .. ప క్కన అత్త గారు ఫీల్ అవుతారు అని నా ఫీలింగ్స్ ని కంట్రోల్ చేస్కున్నాను ..
ఆక్కకి పెళ్లవుతోందంటే ..వాళ్ళ నాన్న అడిగే మాటలకి ఏడుపొస్తుంటే ..నా కూతురు సుసు అని ఏడుస్తుంటే ..దానితో పాటు నేనూ ఫ్లో లో ఏడ్చేశా ..ఆన్ని ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేం కదా ..
ఇవన్నీ ఓకే సర్ ..
ఆ ఫీలింగ్స్ ఏంది??
మాలా అరేంజ్డ్ మ్యారేజ్ చేస్కున్న వాళ్ళ గురించి ఆలొచించరా
ఏం ఫీలింగ్స్ ఫీల్ అవ్వకుండా చేసేసుకున్నారు అని వెక్కిరిస్తున్నరా ??
సర్ ,
పొద్దున్న లేస్తే మేము ఎన్ని ఫీలింగ్స్ ఫీల్ అవ్వాలో తెలుసా ?
పనమ్మాయికి జ్వరం వస్తే నేను అంట్లు తోముకోడానికి ఫీల్ కావాలి...
మా పిల్ల యూనిఫామ్ మాపుకొస్తే ఫీల్ కావాలి...
దోశ కాలక పోతే ఫీల్ కావాలి...
ఇన్ని ఫీలింగ్స్ మధ్య లో మీరు చెప్పే ఫీలింగ్స్ ని ఫీల్ అవ్వడానికి టైం ఎక్కడుంది
సరే లవ్ రీస్టార్ట్ చేద్దామని .. సినిమా నుండి వచ్చాక నేను ఆయన్ని వరుణ్ అని ..నన్ను భానుమతి అని ఫిక్ష్ అయ్యాము
ఇద్దరం కూర్చుని మాట్లాడుకుంటున్నాం
సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు వాడు డ్యూ డేట్ గుర్తు చేయడానికి ఫోన్ చేసాడు.. మా అయన వరుణ్ కాదు కదా మనిషి లా కూడా లేరు ..!!
నన్ను భానుమతి అనుకుని ..పలకరిద్దామని వచ్చారు ...మూలనున్న బట్టలు ..ఆకాశం లో ఉన్న మబ్బులు మ్యాచ్ అవ్వక ఇర్రిటేషన్ లొ ఉన్న నేను కస్సుమని కసిరాను
అంతే లవ్ మూడ్ కాస్త వార్ మోడ్ లోకి వెళ్ళింది ..!
ప్లీజ్ ప్లీజ్ ..భానుమతి ని వరుణ్ ని పెట్టి పెళ్ళయాక ఎలా ఉంటుందో ఒక మినీ మూవీ తీయండి
అప్పుడు నా లాంటి ఆంటీ లకు తృప్తి గా ఉంటుంది
అంటే పెళ్ళైన కొత్తల్లో కాదు..ఒక అయిదు ఆరు ఏళ్ళు అయ్యాక ..భానుమతి ఒక పిల్ల తల్లి అయ్యి..వరుణ్ కుటుంబ బరువు బాధ్యతలు మోస్తూ ..అలా అన్నమాట
ఆసల్ నాకు తెల్వక అడుగుతాను ..ఇన్ని ఫీలింగ్స్ అర్థం చేస్కునే మీరు..ప్రతి అమ్మాయి .లోను ఒక హిడెన్ భానుమతి ఉంటుంది ..ఎంతో మంది మర్చిపోయిన ఫీలింగ్స్ మల్లి గుర్తు చేసుకుంటారు అన్న ఆలోచన రాలేదా? ఇది మానిపోయిన గాయాన్ని రేపటం కాదా?
అప్పటి అనంద్..ఇప్పటి వరుణ్ ని తల్చుకుంటూ ..రెక్కల గుర్రం కోసం ఎంత మంది ఆడపిల్లలు లు ఎదురు చేస్తున్నారో తెల్సా..ఏమి చేయలేక అనంద్ ని తల్చుకుంటూ కప్పుల కప్పుల కాఫీ లు తాగేస్తున్నారు ..కొంత మంది చీరలు కట్టుకుని సెల్ఫీ లు దిగేసి ..రూప లా ..సీత లా ..భానుమతి లా ఫీల్ అయిపోతున్నారు..
లీడర్ సినిమా చూసొచ్చి హాస్టల్ రూం లో తలుపులు వేసుకుని ..వందేమాతరం పాడి ..జనగణమణ చదివేసుకుని ..నా దగ్గరున్న watercolors తో ఇండియా ని గీసి నెను సైతం .అనుకున్న దాన్ని నేను
హ్యాపీ డేస్ చూస్తూ ఫ్రెండ్స్ అందరం థియేటర్ లో హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ అని కోరస్ పాడుతూ ..కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటుంటే ..మా పక్కన అంకుల్స్ మమ్మల్ని చూసి కుళ్ళుకుంటున్న చూపులు అప్పుడు అర్థం కాలేదు..ఇప్పడు భానుమతి ని వరుణ్ ని చూస్తుంటే అర్థం అవుతోంది వాళ్ళ బాధ .. దీన్నే సర్.. కర్మ గోస్ అరౌండ్ ..comes అరౌండ్ అంటారు
అలాంటి వ్యక్తిత్వాలు ఎక్కడుంటాయి సర్.. ..ఆనంద్..రామ్ ..వరుణ్ ..సీత ..రూప ..భానుమతి ? మీరేమైనా వెకేషన్ కి చంద్రమండలం మీద కి వెళ్తూ ఉంటారా??
మా లా EMI లను ..prodcution issues లను ఫామిలీ డ్రామాస్ ని సీరియస్ గా తీసుకునే మమ్మల్ని మళ్ళీ లవ్ లో ముంచి తేల్చేసి ..ఇప్పుడు అలా ఉన్నామో లేదో తెలియక తికమక ఫీలింగ్స్ తో మిగిలిపోయాం
అసలు పెళ్ళికి నేను పెట్టిన ఒక కండిషన్ శేఖర్ కమ్ముల గారి మూవీస్ కి తీసుకెళ్లమని తెలుసా..
మీకు నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తే మీరు నన్ను ఇంత డిస్టర్బ్ చేస్తారా?
దీనికి శిక్ష గా మీరు నేను చెప్పిన మినీ మూవీ ని తీస్తే నా ఇగో కాస్త చల్లారుతుంది ... ఎనీ వేస్ ..ఐ హేట్ యూ శేఖర్ కమ్ముల గారు..
బట్ ఐ లవ్ ఆనంద్..ఐ లవ్ హ్యాపీ డేస్..ఐ లవ్ గోదావరి ..ఐ లవ్ లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ ...ఐ జస్ట్ లవ్ ఫిదా.. బట్ ఐ హేట్ యు :D
23 July 2017
ధ్యానం
ఇప్పడు నేను ఎలా చేయాలో చూపిస్తాను.. కళ్ళు మూసుకుని చదువుతూ చేయండి..ఎల్ .కె .జి సైన్స్ పుస్తకం పక్కన పెట్టుకుని కూర్చోండి ....
కళ్ళు మూసుకోండి
RelaaaaXxx!!
Relax your toes(పక్కన పుస్తకం తీసి 5 వ పేజీ లో parts of the body తెరవండి.. టోస్ - కాలి వేళ్ళు .. )..Feel that the energy is passing to your leg (leg - దీనికి పుస్తకం చూడక్కరలేదు ..నాకు తెలుసు మీరు తెలివిమంతులని..)..And then to your knees(చూడండి పర్లేదు.. నేను ఎవరికీ చెప్పను ) and then to your spine (ముందు కాదు వెనకది ..నేను ఎనర్జీ ని ముందు పంపడానికి ట్రై చేశా .. ఎందుకు వెళ్లట్లేదో అని గూగుల్ చేస్తే ..స్పైన్ ముందు కాదు వెనక అని ఉంది.. )and then to your neck and then to your forehead (నుదురు.. నేనైతే ధ్యానం చేసేటప్పుడు తెలీకుండా నాలుగు తలలు వచ్ఛేస్తాయేమో అని ఎనర్జీ ని గో గో అంటున్నా.. వెళ్లట్లేదు.. పక్క వాడిని పిలిచి forehead అంటే ?? అని అడిగా ..తల పట్టుకున్నాడు ..ఓహ్ అర్థమైంది ..ఎహె అది కాదు.. ఇది అని అక్కడున్న మార్కర్ తో నుదుటి మీద కొట్టాడు .. అప్పుడు వెలిగింది ..నాకు ముందే తెలుసు.. కానీ వాడిని పరీక్షించా ) and finally to your heart and you feel relaxed...RelAXeddd...Relaxxxxxeeddd...!
concentrate on your breath!!.. Inhale Peace.. Exhale Stress..Continue doing this ..
ఊహించుకుంటే భలే ఉంది..
Inhale Peace(కారు ,బంగలా,3 కోట్లు బ్యాంకు బాలన్స్ ,నా ప్రమోషన్ (నీ తలకాయ ...3 కోట్లు ఉంటే బోడి ప్రమోషన్ ఎందుకు.. కుక్క బుద్ధి ).. Exhale Stress (మా మేనేజర్ ,నాకు బ్యాంకు లోన్ ఇచ్సిన మేనేజర్ .. నాతో పని చేసే ఆ పవన్ గాడు .. బయటికి వెళ్తున్నారు .. నా ఆఫీస్ మెయిల్స్ అన్ని డిలీట్ అయిపోతున్నట్లు.. ..కనిపిస్తున్నాయ్ )
ఎంత హాయిగా ఉందో ..ఇది నిజం .ఇదే నిజం ... మిగితాది అంతా అబద్దం ..! నాకు కనిపించేదే నిజం ..!
ఇలా రెండు ఆంటే రెండు నిమిషాలు వాళ్ళు చెప్పేటప్పటికి చాలా అంటే చాలా హాయి గా అనిపించింది ..ఈ లోపు ఇలాగే కళ్ళు మూసుకుని ఉండండి..చక్కటి సంగీతం పెడతాము.. వింటూ ఏమి ఆలోచనలు వస్తే వాటిని రానివ్వండి.. దేన్నీ ఆపద్దు అన్నారు.. ఇక నా బుర్ర మొదలు పెట్టింది ..ధ్యానం ఆంటే ఇంతేనా..మాములుగా అయితే సంగీతం లేకుండా ఏడుస్తాము.. ఇప్పుడు స్పెషల్ ఎఫెక్ట్స్ తో బాధ పడతాము ..ఇంతకీ ఇప్పుడు గిరిధర్ వస్తే ఏం చెప్పాలి.. రాత్రి నుండి టెస్టింగ్ స్టార్ట్ అవుతుంది...ఈ పల్లవి రేపు జ్వరం వచ్చే లా ఉంది అని ఈ రోజు వెళ్ళిపోయింది.. ఆ పవన్ 3 టిఫిన్ లు 30 సిగరెట్లు కాన్సెప్ట్ తో చాలా కూల్ గా ఉంటాడు..వాళ్ల కి కిరీటాలు లేవు..నాకు ఉంది..లీడ్...అన్నిటికీ నేనే బాధ్యురాలిని..దాని జ్వరానికి..వీడి ఆకలికి ..ఈ రోజు ఎలా అయినా పని అయిపోతుంది అని నిన్నే చెప్పాను.. ఈయన ఎవరిని ఇప్పటికి వరకు తిట్టలేదుట ..నా తోనే మొదలవుతుంది..ఆ సాధు జీవి కి కోపం తెప్పించిన వింత జీవి లా అందరూ నన్ను చూస్తారు..ఆ అవమానం తట్టుకోలేక..ఉద్యోగం మనేస్తాను...ఏదీ దొరక్క ఇంట్లో అంట్లు తోముకుంటూ ఉంటాను...దానికి మెచ్చి మా పాత పనమ్మాయికి ఇచ్ఛే 1800 నాకు ఇస్తే ఏం చేసుకోవాలో తెలీక ..ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియక సతమవుతుంటే... "కిరణ్ ..స్టాప్"...అందరి ముందు అరుస్తాడేమో..అయ్యయ్యో ..ఎలాగ??..అయ్యే నేను ధ్యానం చేస్తున్నా.. ఇలాంటివి ఆలోచించకూడదు.. శివ శివ ..రామా ..your waiting list number is in next జన్మ .. నంబర్ 123456789..ఇందాక ఎక్కిన ఎనర్జీ అంతా భయంగా మారిపోయి..కాళ్ళు ..వళ్లు.. కళ్ళు ..గోళ్లు..మొత్తం పాకిపోయింది..ఈ భయం లొనే ఈ గిరిధర్ మా బెజవాడ బాబాయ్ లా ఉంటాడు...మెహం అంతే ప్రశాంతంగా.. ఉంటుంది .. నవ్వుతూ పలకరిస్తాడు.. ఇప్పుడు ఎలా స్పందిస్తారో.. అమ్మో..అయిపోయింది.. నా ఉద్యోగానికి స్వస్తి చెప్పే రోజు ఇదే ..ఇక రిటైర్మెంట్ వచ్చే రోజులు దగ్గర పడ్డాయ్ కాబట్టి.. దేవుడు ధ్యానం మీద మొగ్గు చూపేలా చేసాడు...ఇక ఆలోచించలేనంత భయంతో ఉండగా అక్కడ మ్యూజిక్ ఆగిపోయింది...చాలా రిలాక్స్ అయ్యారు కదా..(అది మేము చెప్పాలి.. మీరు చెప్పకూడదు )రోజు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి(అవునవును .. నేను చేసిన లా చేస్తే మా ఇంట్లో వాళ్లకి మంచి ఫలితాలు ఉంటాయి )...ఇంకా వివరాలకు మా వెబ్సైట్ చూడండి.. ఇపుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి...నెమ్మదిగా...
ఎదురుగా గిరిధర్ ..
బాబాయ్..!!(ఈయన ఇలా ఎదురుగుండా ఎంత సేపు కూర్చున్నాడో ..అయిపొయింది)
కిరణ్ ఏం చేస్తున్నావ్..ఓకే listen
ఆ టెస్టింగ్ టీం వాళ్ళకి ఇంకో వారం పడుతుంది ట మొదలు పెట్టటానికి ..సో రేపు పూర్తి చేసి నాకు చెప్పు చాలు అన్నాడు..
ఇంక చాలా రిలాక్స్డ్ గా అనిపించింది.. అనవసరంగా .. ఇంత సేపు ఆలోచించాను ..అయినా ఆది నా తప్పు కాదు ... నా ముక్కులోనుండి అందరూ బయటికి వస్తున్న సమయాన . మ్యూజిక్ పెడతాను ..ఏమి ఆలోచించద్దు అని ఆలోచనలని గుర్తు చేసిన ఆ అమ్మాయిది ...
ఇది ఉమెన్స్ డే న మా ఆఫీస్ లో ఒక సెషన్ ...నేను రూమ్ లోకి వెళ్లే టైం కూడా లేక సీట్ లోనే కూర్చుని జ్ఞానిని అయిపోయాను ..! Yes I am జ్ఞాని .. అలా ఎలా ఆ నిర్ధారణకు వచ్చానో చూడండి ..
కానీ ఆలా ఎనర్జీ ని పాస్ చేసేటప్పుడు .. నా కళ్ళ ముందు నా task కి ధ్యానానికి చాలా లింక్ కనిపించింది .. 1 రన్ అవుతే 2 రన్ అవుతుంది .. 2 రన్ అవుతే 3 రన్ అవుతుంది... ఇలా లింకు ఉంది.. అలాగే.. నా వేళ్ళ నుండి తల వరకు ఆలా ఫోకస్ చేస్తుంటే.. భలే అనిపించింది ..ఇందులో ఏ ఒక్కటి పని చేయక పోయినా మనిషి బె బె కదా.. అన్నీ పని చేస్తున్నందుకు మనం హ్యాపీ గా ఉండాలి కదా ..
ఇప్పటికి అర్థం అయ్యిందా గొర్రె .. ! ఎక్కడ ఎవరు అంటున్నది?? మొత్తం చూసాను . ఎవరూ కనిపించలేదు ..మాట మాత్రమే వినిపించింది.. అప్పుడు అర్థం అయ్యింది ..నాకు జ్ఞానోదయం అయ్యింది అని.. !!
మీకు ఇలా జ్ఞాని గా మారాలి అని ఉంటే ..మీ ముక్కులో నుండి మీకు నచ్చనివి అన్ని పంపించేయండి ..
ఇంకో విషయం కూడా తెలిసింది..ఒక ముక్కు రెండు రంద్రాలు ఎందుకున్నాయో ..!!
అబ్బా మీకు నన్ను పొగడాలి అని ఉంది కదా ..పొగడండి ..పర్వాలేదు ..
11 March 2014
పెళ్లి రోజు కానుక !!
10 March 2013
రెండు రోజుల పెళ్ళి రోజు
ఏవరికి నాన్న…?
నాకు ..మీ…అమ్మకి…
అయితే తమ్ముణ్ణి రమ్మని ఫొనె చేస్తాను …
ఏం తిక్క తిక్క గా ఉందా …?
వచ్చే వారం …పెట్టుకుందాం …
వద్దు..అనుకున్నవి అనుకున్నప్పుడే అయిపొవాలి…
ఆవును…మరి మీ నాన్న మా పెళ్ళైన కొత్తల్లో తమిల్ నాడు టూర్ వెళ్దాం అన్నారు …ఇప్పటి వరకు ఎందుకు కుదర్లేదో …అంటూ మాట విసిరింది మాతా శ్రీ ..
హిహిహి
నవ్వాపి ఫొనె పెట్టేయ్ ..శనివారం పొద్దున్నకళ్ళా ఊరికొచ్చెయ్ …
ఆసలే వివరాలు అడగవా ….??
ఏమడగాలి ..ఫొటొ చూసాను కదా …?
ఏ ఊరు..ఎంత మంది అక్క చెల్లెల్లు..వయసెంత ..?
సరే మీరే జవాబులు చెప్పండి ..
పొగరు ….ఇలాగే మాట్లాడకు ….వెనక్కెళ్ళిపొతారు ..
జవాబులు ..
ఉఫ్ఫ్ ….ఒక చెల్లి…తూర్పు గోదావరి జిల్లా …
అయ్య్ రాముడికి దగ్గరవుతా …
ఆన్నీ కుదిరితే అవుతావ్ …లెదంటే వేరే అమ్మాయికి అవుతాడు ..
ఎహె నాన్న ..వచ్చే అబ్బాయ్ గురించి కాదు ….శ్రీ రామ చంద్రుడి గురించి మాట్లడుతున్నా ..
గోదావరి చూడచ్చు ..శేకర్ కమ్ముల ఎంత బాగా చూపించాడు …
ఉఫ్ఫ్ …..దానిని ఓ సారి ఆ గుడికి తీస్కెళ్ళి ఏమన్నా పట్టిందేమొ స్వామి ని అడిగేసి రా..
నాకేమి అవ్వలేదు ..రమ్మంటె వచ్చా కదా …ఇంకెందుకు నస…
రేపు మధ్యానం మూడున్నరకి మంచిదట …అప్పుడు వస్తారు …ఏ ఫ్రెండ్స్ కి appointment లు ఇవ్వకుండా ఇంట్లొ ఉండు …
గుర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్ర్
అమ్మాయి తల్లిదండ్రులు ...అబ్బాయి తరపు వాళ్ళు ...మట్లాడుకోండి అని వదిలేసేలితే ...
ఎలా మొదలెట్టాలొ తెలీక ...ఏం మట్లాడాలో తోచక గోడకేసి చూస్తే తలపొగరనుకుంటారని...నేలకేసి చూస్తూ సిగ్గు పడుతున్నట్లు నటించేస్తున్నా …
కిందకి తల వంచుకొని కూడా ...ముందరున్న అబ్బాయి గురించి కాక ..ముందు రోజు డామేజర్ అన్న మాటలకి..సలా సలా మరిగిపోతున్న రక్తాన్ని ...కాస్త చల్ల బరచడానికి ..మురారి లో మహేష్ బాబు ని గుర్తు చేస్కుంటూ ఉండగా ..
మీరు మొదటి నుండి అదే కంపెనీ ఆ అన్నాడు ...
నాకు ప్రశ్న ల లో నచ్చని ఒకే ఒక్క ప్రశ్న అది..
వంచుకున్న తల అలాగే ఉంచి..అరుందతి లో అనుష్క లా కళ్ళు ఎర్ర చేద్దామనుకుని ..వచ్చిన మనిషి ఎవరో ఓ సారి గుర్తు చేసుకుని ...సొనాలి బింద్రె లాగా అమాయకంగా చూస్తూ ..అవునండి అని చెప్పాను..
మీ చదువు...??
ఇక్కడే ఈ ఊర్లొనే ...
మరి మీది..??
అక్కడే ఆ ఊర్లొనే ...
ఓహొ ఇద్దరం ఊరోల్లమే ..నొ ప్రొబ్లెం...
సినిమాలు ...
అస్సలు నచ్చవండి ...అసలు వెళ్ళను ..
మహేష్ బాబు సినిమాలు కూడా నా ..??
అదోలా చూపు..
ఏం లేదు నేను మహేషు ,ప్రభాసు సినిమాలు మాత్రమే చూస్తాను ...నాకు మరీ నచ్చి తీస్కెళ్ళమంటే..?
ఏమో తెలీదు ..తీస్కెళ్తానేమో ...అయినా ..మీరు మీ ఫ్రెండ్స్ తో వెళ్ళచ్చు ...
మా నాన్నకంటే ఉదార స్వభావుడిలా ఉన్నాడు ....మా నాన్న పెళ్ళైన పదేల్లకి మా అమ్మకి ఫ్రీడొం ఇచ్చారు ...ఇతను కలిసిన పది నిమిషాలకే ఇచ్చేస్తున్నాడు ..సర్లే అన్నీ కుదిరినప్పటికి ..
ఇంకో చివరాఖరి ప్రశ్న నేనే వేసి ఆపేద్దం అనుకుని…
పుస్తకాలు చదువుతారా అని ఏదో నేను 100 పుస్తకాలు చదివేసినట్లు అడిగాను ..
విజయానికి 5 మెట్లు చదివానండి …
ఫక్కున వస్తున్న నవ్వుని ఆపుకుని….ఎన్నో మెట్టులో ఉన్నారో అని అడగబోయి …మళ్ళీ ఆగిపొయి ..ఈ సారి గొడకేసే చూస్తున్నా ..
ఇంకా ఎమన్నా ప్రశ్నలు ఉన్నాయా అండి
ఏమి అడగద్దు అనే కదా indiect గ అన్నావ్ …అనుకుని…ఉహు..అన్నాను…
మళ్ళీ తలపైకి ఎత్తి చుసే లోపు ..candidate జంప్ ..
హమ్మయ్య అనుకుని నేను రూం లోకి వెళ్ళిపోయి …వాళ్ళెప్పుడూ ఇంట్లో నుండి వెల్లిపొతారా అని ఎదురుచూస్తూ ఉన్నా…
వాళ్ళు వెళ్ళి ఇంకా అయిదు నిముషాలు కూడా అవ్వలేదు ….
సరే ఇంకో పది నిముషాల తర్వాత అడుగుతా …
నాన్నా ..నాకేం తెలియట్లేదు …..ప్లీస్ …కొంచెం టైం ఇవ్వండి …
..
..
..
ఇరవై నిముషాల తర్వాత …
ఆలోచించావా ..?
ఫ్రకాష్ రాజ్ లా కనిపించారు నాన్న ..
ఈ లోపు ఫొనె..
ఎలా జరిగాయ్ రా ..ఏమంటోంది ఇది…??నువ్వు,మీ ఆవిడ ఏమనుకుంటున్నారు ..?
ఆబ్బాయ్ చాలా నిదానస్తుడి లా ఉన్నడు అన్నయ్య ..ఇదే కొపిష్టి అవుతుందేమో అతని పక్కన..
ఇదేమంటోంది …
ఏమి తెలియట్లేదు అంటోంది …
అయితె ఓ కే అన్నమాట ..
ఏం కామేడీ లా…అందరికీ …??ఫొనె పెట్టేయండి నాన్న ….బెంగలూరు వెళ్ళి ఆలోచించుకు చెప్తాను ..
నాకెందుకో ఈ సంబంధం ఖాయం అనిపిస్తుంది రా ..
నాకు అలాగే ఉంది..
మన మొండి ఘటం ఏదో ఒకటి చెప్పాక నాకు చెప్పు రా అంటూ ఫొనె పెట్టేసారు పెదనాన్న గారు …
వాళ్ళ అమ్మ గారు ..అబ్బాయ్ ఎదో తికమక లో ఉన్నాడండి …చెప్తాడు …అమ్మాయ్ ఏమంటోంది అన్నారు ..
మా నాన్న ..హెల్లొ హెల్లొ అంటూ పెట్టేసారు ..
శంక్రాంతికి ముందు రోజు ఫొనె చేసి ..మా కుటుంబాలంతా ….గోదావరి నుండి కావేరి కి తరలి వచ్చాయ్ ..ఓ సారి పిల్లని బెంగలూరు తీసుకొచ్చి చూపిస్తారా ..అని అడిగారు ..
వెళ్దామా అన్నారు నాన్న ..?
నేను మా డామేజర్ తో పోట్లాడి మూడు రోజులు సెలవ తీసుకుని వచ్చాను ….నేను మళ్ళీ ఇప్పుడు బెంగలూరు రాను ..
నచ్చిందండి మాకు అమ్మాయ్ అని రెండు రోజుల తర్వాత చెప్పారు ..
మా అమ్మాయని చెప్పటం కాదండి ..చాలా నిదానస్తురాలు ....
మా అబ్బాయని చెప్పటం కాదండి..గూడ్స్ బండి లాంటోడు ..
దేవుడంతే భక్తి బాగా ఎక్కువండి ...పిల్లకి...
మా అబ్బాయి గుళ్ళోనే ఉంటాడండి ...
సాఫ్ట్వేర్ ఇంజినీర్ అన్నారు...
కాని వాడి మనసు ఎప్పుడూ దెవుడి మీదే ...అని అర్థమండి ...
చాలా మంచిదండి ...బాగా మ్రుదు స్వభావి ...
మ అబ్బాయిది మల్లె పూవు లాంటి తెల్లని..స్వచ్చమైన ..మనసు...
పిల్ల 5.2
అయితే అబ్బాయ్ బాగా పొడుగు 5.4
మా అమ్మాయ్ ఇంట్లొ ఉన్నది చాలా తక్కువ...అందుకే పెద్ద పెద్ద పనులు రావు ..
మ అబ్బాయ్ చాల పని వంథుడు అండి ..వాళ్ళ అమ్మకి కూడా వెనక వెనక ఉండి సాయం చేసేవాడు ..
అందుకే అండి పెళ్ళి అయ్యాక కూడా అబ్బాయ్ సాయం చేయాలి ..ఇది వరకటి లాగా కాదు కదా...ఉద్యోగము ..ఇంట్లో పని..అన్నీ పిల్ల చెస్కోలేదు కదా మరి
చెప్పాం కదండి ..మ వాడు బంగారం ...మీరు దేని గురించి అలొచన పెట్టుకోవద్దు ..
ఇదంతా విని మా తమ్ముడు ఒసేయ్ పెద్దమ్మ నీకు పేద్దగా పనులు రావు...మా పిల్ల ఇత్తడి అని చెప్పేసొచ్చిందే .....వాళ్ళు వాళ్ళ అబ్బాయ్ కి నూటికి రెండు వందలు వెసుకుంటే..మన వాళ్ళు నీకు యాభయ్ మార్కులు వెసరు అంటూ కికికి అన్నాడు...
29 August 2012
సీరియల్స్ బామ్మ
"మళ్లీ ఏమైంది...?"
"కొత్తగా అవ్వడానికి ఏమి లేదు...మీ అమ్మ గారున్నారే..."
"మీ ఇద్దరి గోల నాకు చెప్పద్దు అని ఎన్ని సార్లు చెప్పాను...?"
"హా..చెప్తారు....పిల్లలు కూడా వాళ్ళ బామ్మ అంటేనే పారిపోతున్నారు...."
"మరీ మా అమ్మ అంత గయ్యాళి ఏమి కాదు...."
"నేనన్నానా..??..ఆ టీ వీ ఇంట్లో వద్దు....ఎవరికన్నా ఇచ్చేద్దాం...ప్లీజ్..!!"
"అబ్బా...అది ఉంటే ఏదో ఒకటి కాలక్షేపం ఆవిడకి..."
"సరే నేను రేపు ఎట్టి పరిస్థతిల్లో... మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిందే...మీరు సెలవ పెట్టుకుని...అత్తయ్య గారిని చూస్కోండి..."
"అలాగే లే...పో.."
--------------
పొద్దున్న ఆరింటికి పెద్దావిడ లేచి...
"అమ్మా..ఈ రోజు అది వాళ్ళ చెల్లి ఇంటికి వెళ్ళిందే....నేనే ఉన్నాను....నాకు టీ చేయడం మాత్రమే వచ్చు...కాఫీ రాదు.....ఏది ఇవ్వమంటావ్..?"
"అదేంట్రా పార్వతి ...పుట్టిల్లు సీరియల్ లో లక్ష్మి వాళ్ళ అత్తగారికి చెప్పకుండా బైటికి వెళ్ళినట్లు వెళ్ళిపోయింది..??...సరేలే...ను
"అమ్మా..టీవీ లో ఊరకే చూపిస్తారు....అలాగే రావాలంటే కష్టం.."
"ఏదో ఒకటి పెట్టు..ఈ లోపు గీజర్ వేసి రా.....అసలే తల స్నానం చేసి.....వెంకన్న గుడికి వెళ్లి ..ఇక్బాల్ మీద అర్చన చేయించాలి..?"
"వాడెవడు అమ్మ..చిన్ని ని దింపే ఆటో వాడా....?"
"ఛి ఛి..కాదు రా.....ఈ రోజుతో నాలుగు వంద ల ఇరవై రెండో భాగం పూర్తి చేస్కుంటున్నా చెక్కెర పాకం సీరియల్ లో ని ఇక్బాల్ హాస్పిటల్ లో ఉన్నాడు....వాడికి నయం అవ్వాలని...అర్చన చేయిస్తా అని వెంకన్నకు మొక్కుకున్నా...!!"
"అమ్మా...??????????"
"టీ బానే ఉంది రా..ఇంకా కొంచెం రంగు ఉంటే బాగుండేది....ఆ పెద్ద కూతురు సీరియల్ లో వాళ్ళ చిన్న కోడలు...రంగు రంగుల..కప్పులో భలే చిక్కగా పెట్టిస్తుంది రా వాళ్ళ మామగారికి.."
"అమ్మా...?????????"
"నీళ్ళు కాగుంటాయి...ఈ లోపు నువ్వెళ్ళి పక్క కొట్టు లో కొబ్బరికాయ పట్టుకు రా..ఆ తట్టల సవ్వడి సీరియల్ లో వైదేహి కి కడుపొస్తే పంచ ముఖ గణపతి గుడిలో కొబ్బరి కాయ కొడతా అనుకున్నా...మొదట అక్కడికి వెళ్లి వెంకన్న గుడికి వెళ్ళొస్తా..."
"అమ్మా...???????"
"ఏ రా...వెళ్ళొస్తా...పదకొండు కల్లా వచ్చేస్తా.......కొన్నితెలుగు సీరియల్ లు తమిళ్ లో వస్తాయ్...కథ ముందే తెల్సుకోవచ్చు.."
"హా..మరే ఎం బి బి ఎస్ పరీక్షలు సిలబస్ ముందే తెల్సుకుని చదువుకోడానికి.."
"దానికంటే గొప్ప రా నేను...ఎన్ని సీరియల్ లు..ఎన్ని పాత్రలు గుర్తు పెట్టుకుంటున్నాను...."
"హా..సరే లే వెళ్ళు....నేను మా ఆవిడకు ఫోన్ చేస్కుంటా..."
ట్రింగ్..ట్రింగ్..ట్రింగ్...
"అయ్యో ఇదేంటి మొబైల్ పట్టుకెళ్ళలేదు..."
"అమ్మా...రామ చంద్ర....ఎండ మండిపోతోంది రా...ఆ ఫ్రిజ్జి లో పెట్టిన చల్లటి మంచి నీళ్లివ్వు రా.."
"ఇదిగో..."
"ఆ వార్తలు పెట్టకు...తల నొప్పి..చెప్పిందే చెప్తూ ఉంటారు...."
"సరే కానీ...పార్వతి ఫోన్ తీసుకెళ్ళలేదు ..మర్చిపోయిందనుకుంటా"
"కాదు రా..నాకోసమే అయ్యుంటుంది..."
"నీకేం పనే ఫోన్ తో..?"
"ఆ ఇత్తడి బొమ్మ సీరియల్ లో ఆ పిల్ల ని కిడ్నాప్ చేసి ఒక చోట పెట్టారు...మొన్న...ఆ విలను...ఆ పిల్ల తండ్రి ఫోన్ నెంబర్ గట్టిగా చెప్తూ ఉంటే నేను ఆ పక్కనే ఉన్న క్యాలెండర్ మీద రాసాను చూడు..."
"అమ్మా..???????????"
"అన్నం వండావా ...?..ఆకలి వేస్తోంది .."
"సరే..ఇంకో విషయం.....ఇందాక డిష్ వైర్ ....నేనే లాగేసా....ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పెట్టకండి..."
"హహహ...అలాగే..నాన్న.."
"ఇంతకీ బుజ్జోడెక్కడ..??"
"వాడు మెడ మీద క్రికెట్ ఆడుకుంటాడు..రోజు స్కూల్ నుండి రాంగానే..."
"ఓహో..."
"నాన్న..నాన్న....టీవీ లో ఫుట్ బాల్ మ్యాచ్ వస్తోంది అడ్డు జరగండి.."అంటూ వెనక నుండి వచ్చాడు...బుజ్జోడు
"డిష్ రావట్లేదు రా..మధ్యానం నుండి..."
"లేదు లే...వైర్ ఏ కోతో లాగేసినట్లుంది...నేనిప్పుడే పెట్టేసి వచ్చా...."
4 July 2012
మీరంతా ఆహ్వానితులే ... :)

అమ్మ అమ్మమ్మ కి వంట్లో బాలేదనో..తాతయ్యకి జ్వరంగా ఉందనో..పిన్ని రాక రాక పుట్టింటికి వచ్చిందని చూడటానికి వెళ్తేనో..నా పెతాపం బైట పడేది..కొన్ని రోజులు నాన్న చేసేవారు...తర్వాత అమ్మతో తిట్లు తినేవారు..."బాగుంది...అన్నీ మీరు చేస్కుంటే దానికేప్పుడు పని వచ్చేది...వదిలేయండి..వచ్చీ..రానీ వంటలు పనులు చేస్కుంటేనే కదా మనం ధైర్యంగా ఇంకో ఇంటికి పంపగలం"..అంటే..అప్పట్లో ఏమనుకునే దాన్నంటే..దీనికి ఉద్యోగం రాకపోతే కనీసం ఈ పని కైనా పంపిద్దాం అనుకున్నారేమో అనుకునే దాన్ని...పిచ్చి మొహాన్ని...అసలు మెయిన్ కాన్సెప్ట్ అర్థమే అయ్యేది కాదు...నాన్న కూడా అమ్మ మాటలు మనసు మీదకి తీస్కోని....వంటిట్లోకి రావడం మానేస్తే నేను బెడ్రూం లో కి కూరలు ..బియ్యం..చపాతీ పిండి తీస్కోచ్చేదాన్ని...నాన్న వీటితో మీకు ఏదోస్తే అది చేయండి..గ్యాస్ స్టవ్ కూడా ఇక్కడికే తీసుకొస్తా అని...మా నాన్న కొంచెం కూడా మొహమాటం లేకుండా ఆ సదవకాశం నీకే ఇస్తున్న...ఏదోస్తే అది నువ్వే చెయ్యి అన్నారు... కన్నీళ్లు ఆగక బియ్యం పోసుకోచ్చిన గిన్నెలోనే పడ్డాయి....ఆ నీటితోనే బియ్యం కడిగి అన్నం వండాను....తర్వాత బెండకాయలు కసాబిసా లెక్కగా కోసేసి....లెక్కంటే..
సాయంత్రం ఇంటికి రాంగానే ఎలా ఉంది అని కూడా అడగను...తండ్రికన్నా ...పుత్రికోత్సంబు ఉంటుంది...తమ్ముడికి ఉన్న ఉత్సాహం కూడా పోయుంటుంది కాబట్టి..ఏ క్రికెట్ బాట్ పెట్టో నెత్తి మీద కొట్టాడంటే..వద్దులే ..మీరంతా ప్రశాంతంగా ఉంటారు :P .కాని నాన్న నేను మళ్లీ సాయంత్రం వంట చేస్తున్నప్పుడు నెమ్మది గా వచ్చి..స్టవ్ సిం లో పెట్టుకుని వండు అన్నారు...ఇప్పుడేమో బంగాలదుంపలు ...పొద్దున్న చారే..వేడి చేశా అన్నమాట...ముగ్గురం ఒకే చోట కూర్చుని తినాలి..కానీ నాకేమో మీకు తెల్సినట్లే సిగ్గెక్కువ కదా..."నాన్నా.. మళ్లీ తింటా" అంటే...మూడో కంచం నా వైపు తోసారు.... :(
ఆ రోజూ నేనూ, తమ్ముడూ..దేనికోసమో పిచ్చి పిచ్చి గా కొట్టుకుని మాట్లాడుకోవట్లేదు...మా ఇద్దరినీ తిట్టి నాన్న కూడా చాలా సైలెంట్ అయిపోయి...పెద్ద దానివి...ఆడ పిల్లవి ..వాడితో సమానంగా పోట్లడుతావ్....సర్డుకోవద్దు అని స్వరం పెంచారు...నోట్లో ఒకొక్క ముద్దా పెట్టుకుంటూనే వెక్కి వెక్కి ఏడుస్తున్నా...వాళ్ళిద్దరూ ఎప్పుడో అయిపోగొట్టి వెళ్ళిపోయారు..కానీ నా తిండి అవ్వట్లేదు...ఇక మా తమ్ముడుం గారికి కోపమొచ్చి..నువ్వు కనీసం నాన్న తిట్టిన సాకు పెట్టుకునైనా నీ తిండి తినలేక ఏడుస్తున్నావ్..మరి మా బాధ ఎవడితో చెప్పుకోవాలి..అని గట్టిగా అరిచాడు..దుఃఖం ఇంకా ఎక్కువై...ఇంకో సారి అక్కయ్యా..వంట చేయాలంటే నువ్వే చేయాలి అనేలా పేరు తెచ్చుకోవాలని కలలు కంటూ నిద్దరోయాను..
అమ్మ వచ్చాక..పర్లేదు బానే ఉంది దాని వంట అని ఇద్దరూ చెప్పడం తో..TL అప్ప్రైసల్ టైం లో మేనేజర్ కి ఇచ్చే ఫీడ్ బ్యాక్ లాగ ఫీల్ అయ్యి ఆనందపడ్డాను..లేకపోతే మీకు ఈ పాటికి కిరణ్ సహస్త్ర నామావళి అనే పుస్తకం అందుబాటులో ఉండేది...
మా అమ్మ నా మీద నమ్మకం తో తరచూ గా ఊరు వెళ్ళడం మొదలెట్టింది..
ఒకటో సారి - పొద్దున్న బ్లాక్ బెండకాయ్..
రెండో సారి - అవే..
మూడో సారి - డిట్టో
నాలుగో సారి - మీకు తెల్సు..!! :P
ఏదో ఒక సారి మా తమ్ముడు స్కూల్ కి వెళ్తూ వెళ్తూ ...వాళ్ల ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ..అక్కడి నుండి వాడితో వెళ్దాం అని అటు వెళ్ళాడు...ఆ ఫ్రెండ్ వాళ్ల అక్క నా ఫ్రెండ్..
ఏం రా మీ అక్క ఏం చేస్తోంది..??
ఇప్పుడే నాకు..నాన్నకు బాక్స్ కట్టించింది..అక్కా..ఇంకా టిఫిన్ తిని కాలేజీ కి వస్తుంది..
మరి మీ అక్క తెచ్చుకోదు కదా బాక్స్...
ఓహ్ అవునా..ఏమో అక్కా మరి..(అమ్మ దొంగ మొహమా!!)
సరే పైకి రా....వాడు ఇంకా షూస్ వేస్కోవాలి..
లేదక్క..సైకిల్ కి కార్రియర్ ఉంది కదా......కోతులు ఉన్నాయ్..కిందే వెయిట్ చేస్తాం లే..
సరే......అయ్యో కోతి..కోతి..
అయ్యయ్యో...అక్క పెట్టిన కూర అంతా పడిపోయిందే....
అదేంటి రా..అవి ఆ కలర్ లో ఉన్నాయ్...
బెండకాయలు అక్క..
అవి పచ్చగా కదా ఉంటాయి..
మా అక్క చేస్తే నల్లగానే వస్తాయ్ అక్కా..
ఎలా తింటున్నవ్?
ఎవడు తింటున్నాడు...చూసావా...కోతులు కూడా దగ్గరికి రావట్లేదు..
ఓహో..సరే..వెళ్ళండి...
అది కాలేజీ కి వచ్చి అందరికి చెప్పి చెప్పి నవ్వింది దొంగ మొహం ది :(
ఇంకో సారి మా తమ్ముడు ఊర్లో లేడు..నేను,నాన్న మాత్రమే ఉన్నాం...ఈ రోజూ శనివారం...నువ్వు టిఫిన్ చెయ్యి కిరణ్ అంటే..పాపం ఎప్పుడూ ఉప్మా నే వద్దు..నాన్నకు పూరి చేసి పెడతాం అని సూపర్ ఫాస్ట్ గా చేసేసి...నాన్నకు టిఫిన్ ఇచ్చి ..పక్కనే మూడు చెంబుల నీళ్ళు పెట్టి..రెండు గదుల అవతల కూర్చుని....కంగారు కంగారు గా..పుస్తకం తిరగేసి పట్టుకుని.....చదువుకుంటున్నా..
మళ్లీ నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకుని...అమ్మ కోసం ఎదురు చూసి రాంగానే చెప్తే..అమ్మ కాసేపు నవ్వి...చూడు...మరి..వంట రావాలి కదా..అని స్వరం మార్చే లోపు...అమ్మా అన్నట్లు స్నేహ ఏదో చదువుకుందాం రమ్మంది అంటూ సైకిల్ తీసేసా..!!
ఇంత టపా చదివిన మీ అందరికి మా ఇంట్లో విందు భోజనం...మీరంతా ఆహ్వానితులే ... :)
31 December 2011
హ...హ...హ..
"ఏ రోజూ నిద్రలేచినా అది ఆదివారం అయ్యుండాలి...
ఎప్పుడు కళ్ళు తెరిచి అలారం చూసినా అది మోగడానికి ఇంకా అరగంట సమయం ఉండాలి ..
ఒక్క ఇడ్లీ అయినా నవ్వుతూ పెట్టే హాస్టల్ owner కావాలి....
"కిరణు ఆపు..."
"ఏం దేవుడా...."
"ఊపిరి లేని కిరణ్ ని చేద్దాం అనుకుంటున్నా...!!..."
"గాడ్...!!!!"
"మరేంటి నీ కోరికలు??"
"నువ్వు మనిషివైతే తెలుస్తుంది...!!"
"నన్ను దేవతను చెయ్యి..."
"ఆర్ యు sure....."
"yes ..ofcourse..."
"తథాస్తు.."
"అంటే ఇప్పుడు నేను దేవతానా....."
"అవును..నువ్వు దేవతవి...నేను మనిషిని....ఈ ఒక్క రోజూ ఆఫీసు కి సెలవ పెట్టి నా పక్కనే ఉండు..."
"అలాగే..నేను దేవత ని కదా..మా మేనేజర్ ని ఓ ఆట ఆడుకుంటా...చూడు..."
"ఆహా....కలలు కనకు..నీ PA వస్తుంది.."
దేవుడి PA : కిరణ్ దేవత....మీరు ఈ రోజూ X కి promotion లెటర్ వచ్చేలా చేయాలి...
నేను : X కి promotion ఆ ?..నో వే ...నేను ఇవ్వను..X ఏ నా మేనేజర్..
దేవుడు .. పాపా..దేవత కిరణు....ఇయ్యలమ్మా...స్క్రిప్ట్ ముందే రాసుంది....
నేను : :( :(
నేను : ఇద్దో ఆ X నిన్ను నానా మాటలు అనడానికి వస్తున్నాడు....చూసావా...కారాలు మిరియాలు టీం మొత్తం మీద రుద్దు తున్నాడు...
దేవుడు : ఏం పర్లేదు.....నేను మేనేజ్ చేస్కుంటా...
నేను : ఇన్ని రోజులు చేసిన పని కూడా గుర్తు లేదూ..
దేవుడు : ఎవరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు....నాకు నా పని ఎంతో నేర్పించింది..అది చాలు...
నేను : ఎహే నువ్వెలా ఉంటావ్ ఇలా..??
దేవుడు : సరే ఇప్పుడు ఆ గుడికి వచ్చిన భక్తుల్ని చూడు..
నేను : వింటున్నా...వింటున్నా...అన్ని దొంగ దండాలే సామి...పైగా తిట్లు కూడా....వామ్మో..
దేవుడు : చూడు మరి..నువ్వు ఒక్కరి తిట్లే...అది కూడా నీ ముందు తిడ్తే మాత్రమే తెలుస్తుంది...అది కూడా ఎప్పుడో ఓ సారి...
నేను : అవును...నాకు ఈ చెవులోద్దు..ఎన్ని కోరికలు బాబోయ్..ఒక క్షణానికి కొన్ని వేళ కోరికలు...తిట్లు...అప్పుడప్పుడు మాత్రమే పొగడ్తలు...!!
దేవుడు : ఏం తెలిసింది నీకు?
నేను : అన్నిటికన్నా మానవ జన్మ ఉత్తమం..!!
దేవుడు : కిరణు...basically u r very gud కిరణ్ :)
నేను : ఇంకా చెప్తా విను..నువ్వైనా పొగుడు నన్ను..
దేవుడు : చెప్పు..చెప్పు
నేను : మనిషికి కష్టాల్...సుఖాల్....లాభాల్..నష్టాల్..అన్ని కామన్....కానీ వాటి నుండి బైట పడే మార్గాలు కూడా బోలెడు..అయినా వాటినే పట్టుకుని వేలాడుతూ ఉంటాడు...
దేవుడు : సెబాష్..
నేను : ఇద్దో నన్ను మనిషిని చేసేయ్.....కానీ ఓ రిక్వెస్ట్..
దేవుడు : ఏంటో?
నేను : నా జాతకం మార్చేయి..
దేవుడు : ఓ అద్బుతం..దానికేం....
నేను : ఆ ..మొన్న ఒకళ్ళు ఇలాగే చెప్పారు.....ఆ మరుసటి వారం నుండి అబ్బో..జీవితం సూపరు..వాళ్ళు ఎప్పుడు కనిపిస్తారా..ఎప్పుడు కొట్టేద్దామా...అని వెయిటింగ్..
దేవుడు : వాళ్ళు అదృష్టవంతులు...నేనే ఇరుక్కుపోయనన్నమాట..
నేను : సర్లే పో...అందరి కోరికలు వినుపో..టాటా...
దేవుడు : టాటా కిరణ్...హ్యాపీ న్యూ ఇయర్..!!
మీరు వెళ్ళిపోకండి...మీకో అద్బుతమైన అవకాశం...
నా న్యూ ఇయర్ resolution ...కవితలు రాయడం......
హిహిహ్హహుఅహౌహౌఅహౌహాఅ..
ఇద్దో చదవకుండా పారిపోయారంటే..మీ బ్లాగుకొచ్చి..ఇదే కవిత కామెంట్ పెడతాను...
వస్తోంది వస్తోంది...నూతన సంవత్సరం..
పోతోంది పోతోంది....పోతున్న సంవత్సరం...(ప్రాస)
రావాలి రావాలి మీ దగ్గరికి బోలెడు సంబరం..
ఉండాలి ఉండాలి..ఆ..సంతోషం నిరంతరం.....
చెప్దాం చెప్దాం స్వాగతం మనమందరం...(మళ్లీ ప్రాస..)
(బా రాసా కదా....హిహిహిహి..)
మీరు ఏం కోరుకుంటే అవన్నీ మీ దగ్గరకు వచ్చేయాలి...అని మనస్పూర్తి గా కోరుకుంటున్నా... :D
హ..హ...హా...హ్యాపీ న్యూ ఇయర్ :D
20 November 2011
నా 'వెన్నెల' నేస్తాలతో....
నాకు ఒక విషయం తెలిసింది..ఏంటంటే గొప్ప వాళ్ళెప్పుడు సింపులే.......ఉదాహరణకి : జీవని ప్రసాద్ గారు...SRIT correspondent ,ఒంగోలు శీనన్నాయ్...,వెన్నెల కిరణ్..హిహిహి :)
ఎవరినన్నా గొప్ప వాళ్ళు అని అన్నాం అంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా..మరి ఆంగికం అనే కాన్సెప్ట్ ని కనిపెట్టి శీనన్న గొప్ప వారయిపోయారు :)
ఆ రెండు రోజులు.ఎంత నవ్వుకున్నమో..దానికి తొంబై శాతం కారకులు శీనన్న...!!....నిజ్జం...శీనన్న బ్లాగ్ లు కాకుండా podcast లు చేస్తే పిచ్చ పిచ్చ గా హిట్ అవుతుందని నా నమ్మకం..!!ఆ టైమింగ్ కాని..ఆ expression క్యారీ చేయడం కాని...ఆ ఆంగికం కాని...ఆ spontaneity కానీ...అబ్బో వద్దు లే...మా శీనన్న కి దిష్టి తగులుగుతుంది..:P
మొత్తానికి చెప్పాలంటే ఆ రెండు రోజులు రచ్చ..రచ్చవ్..రచ్చ రచ్చః.....నా 'వెన్నెల' నేస్తాలతో రెండు చల్లని రోజులు...:)

గమనిక : పైన ఉన్న బొమ్మ...ఆ రెండు రోజులు ..మా ముఖారవిందాలు :)
ఇంకో గమనిక... : ఈ కలయిక నా వెన్నెల.. దాని పుట్టిన రోజుకి నాకు ఇచ్చిన బహుమతి...:) :P
ఇంకో ఇంకో గమనిక : నూట ఎనిమిదో సారి.. కార్తీక్ కి happy married life :) (మరి నేరుగా...బజ్జులో...బ్లాగుల్లో నూట ఏడు సార్లు చెప్పాను )
ఇంకో ఇంకో ఇంకో గమనిక : ఏమి లేదు...హిహిహి :P
3 November 2011
కిరణ్'s తుంటర్వ్యూ ఆన్ వెన్నెలా's బర్త్డే..
నేను : పొద్దున్నే ఎవరింత గౌరవం లేకుండా పిలుస్తుంది..??
నేనే వెన్నెల ని..
నేను : నువ్వు పొద్దున్నే వచ్చావ్ ఏంటి ..రాత్రి కదా రావాలి ..
వెన్నెల : నీ కుళ్ళు జోకులు వినే ఓపిక నాకు లేదు కానీ ...ఈ రోజేంటో గుర్తుందా ?
నేను : శుక్రవారం..రేపు వారాంతం.... :D
వెన్నెల : ఛా...రెండు సంవత్సరాల క్రితం .........
నేను : హా క్రితం...
వెన్నెల : ఇంకా గుర్తు రాలేదటే ..!!
నేను : లేదు..!!
వెన్నెల : మీ తమ్ముడికి కాల్ చెయ్....
నేను : పొద్దున్నే వాడికా ....ఎందుకు ??
వెన్నెల : వాడికైనా గుర్తుందేమో అని..
నేను : ఓయ్ నా తమ్ముణ్ణి వాడు... వీడు..అంటావ్ ఏంటి ...?
వెన్నెల : నువ్వు ఫోన్ కలుపెహే ..
నేను : ఒరేయ్ తమ్ముడు వెన్నెల నీతో మాట్లాడమంది ..
మా తమ్ముడు : బాగుంటుందా....నాన్నతో నువ్వే మాట్లాడేయి.. బాగుంటే ..నా పర్మిషన్ అవసరం లేదే..
నేను : ఛి ఛి వెధవ .. నా బ్లాగ్ వెన్నెల రా ...
మా తమ్ముడు : ఆదా ....
నేను : కికికికికికికికి ..
మా తమ్ముడు : ఏమంటా ?
నేను : ఈ రోజేదో ప్రత్యేకం అంట ..నిన్ను అడగమంది..
మా తమ్ముడు : ఎంత ఈ రోజూ తారీఖు ...
నేను : నవంబర్ నాలుగు
మా తమ్ముడు : కిరణ్ ..గుర్తొచ్చింది ...ఒకానొక రోజూ బుజ్జి చేత నామకరణం చేయించి నీ పలుకులు తీయగా ఉంటాయని అది భ్రమ పడటమే కాక ..నిన్ను కూడా భ్రమలో పడేసి thenepalukulu.blogspot.com అని ఒక బ్లాగ్ మొదలెట్టిన రోజూ ..నాకు నీ బ్లాగ్ inner voice వినిపిస్తోంది....
నేను : ఏమని??
మా తమ్ముడు : నేను పుట్టాను లోకం బెదిరింది..
నేను ఏడ్చాను readers నవ్వారు
నేను నవ్వాను readers ఏడ్చారు..
అయినా ఈ కిరణ్ కి వాళ్ల మీద జాలి లేదు....కిరణ్ dont care ..!!
నేను : దానిది లాగా లేదు..నీదే అనిపిస్తోంది.....సరే ఫోన్ పెట్టేయి ...
వెన్నెల : నాకు హ్యాపీ బర్త్డే చెప్పి ...అందర్నీ పిలిచి పార్టీ చెయ్యి ...
వెన్నెల : కోయ్ కోయ్ ..కోతలు కోయ్ ....
నేను : నిజంగా నిజం .....సర్లే పోనీ ఈ సంవత్సరం గుండు కొట్టించనా ...??పద గుడికి పోదాం ...
వెన్నెల : ఎహే పో ..నేను అలిగాను ..
నేను : సరే ఉండు నీ అలక తీరుస్తా
ట్రింగ్ ట్రింగ్ ...
శైలు : హలో కిరణ్ బాగున్నావా ??
నేను : హా శైలు బాగున్నా..శైలు ఓ చిన్న పని ...
శైలు : ఏంటో చెప్పు...
నేను : అప్పుడు మనం పెట్టిన ఉత్తుత్తి ఛానల్ ఉందా ..??
శైలు : ఇప్పుడు దాని పేరు ఉత్తుత్తి కాదు ...సుత్తే సుత్తి ఛానల్ ..
నేను : అబ్బో ..బాగుంది ...మన డైరెక్టర్ వంశీ..,కెమెరా మాన్ రాజ్, anchor అప్పు ,script writer ఇందు లు అక్కడే ఉన్నారా .. ??
శైలు : హా..ఉన్నారు ....
నేను : సరే నన్ను , నా బ్లాగ్ ని ఈ రోజూ నీ ఛానల్ లో ఇంటర్వ్యూ చేయాలి ..
శైలు : ఓహో....ఒక సారి వంశీ ని,రాజ్ ని,అప్పు ని కనుక్కోవాలి ..
నేను : వాళ్ళెప్పుడు ఖాళీ నే లే ..నేను పిలిచా అని చెప్పు వచ్చేస్తారు ..
శైలు : నాది అదే భయం కిరణ్ ..నీ పేరు చెప్తేనే రారేమో అని ...
నేను : కోపం తెప్పించకు ..శైలు నాకు తెలీదు ఏం చేస్తావో ..ఇంటర్వ్యూ జరగాలి అంతే ....
శైలు : ఉండు ..వంశీ కి ఫోన్ చేస్తాను..వంశీ మధ్యానం మూడింటికి స్టూడియో కి రా ...
వంశీ : ఎందుకు ...?మూసేస్తున్నామా ఛానల్ ..??జీతం సెటిల్ చేస్తావా ..?
శైలు : కాదు కిరణ్ ని , కిరణ్ బ్లాగ్ ని ఇంటర్వ్యూ చేయాలంట ..కాస్త ప్రోగ్రాం ని డైరెక్ట్ చేద్దువు రా
వంశీ : ఎందుకు కిరణ్ బ్లాగ్ లోకానికి వీడుకోలా ...??? అయితే మనకి సంబరాలే ....టపాకాయలు కూడా తెచ్చేస్తా ..
శైలు : కిరణ్ కూడా line లో ఉంది ...
వంశీ : ముందే చెప్పాలి కదా శైలు...కిరణ్.... ఊరకే సరదాకి అన్నాను లే ....నేను నీ ప్రోగ్రాం ని హిట్ చేస్తా ..వచ్చి డైరెక్ట్ చేస్తా...
నేను : సరే ప్రశ్నలు బాగుండాలి...నన్ను ,నా బ్లాగ్ ని బాగా promote చేయాలి .....పొగడాలి..
శైలు : సర్లే నువ్వు మంచి డ్రెస్ లో రా..
నేను : సరే ఆ రాజ్ ని తుప్పట్టిన కెమెరా కాకుండా మాంచి కెమెరా తీసుకురమ్మని చెప్పు ...
శైలు : కిరణ్ రాజ్ కూడా line లో నే ఉన్నాడు ...
నేను : ఏంటి కొత్తగా BSNL వాడి దగ్గర కాంట్రాక్టు తీస్కున్నావా ..అందరికి ఫోన్ లు కలిపేసి పండగ చేస్తున్నావ్ ..
శైలు : అదేమీ లేదూ లే...నువ్వోచ్చేయ్ ..
నేను : అన్నట్లు ఆ అప్పు ని సగం సగం తెలుగు కాకుండా ....మంచిగా తెలుగు మాట్లాడమను..
ఇందు,శైలు,వంశీ,రాజ్ : నువ్వు సరిగ్గా మాట్లాడు ముందు ..
నేను : ఏంటి అందరూ ఒకటే సారి..??
సరేలే ...కర్రెస్ట్ గా మూడింటికి ఉంటా..
అందరూ నా స్నేహితులే అయినా..చణువు తో తింగరి ప్రశ్నలు అడుగుతుందేమో అప్పు అని లోలోపల ఒక భయం..మరి ప్రశ్నలు తయారు చేసింది ఇందు కదా..ఆ రాజ్ నన్ను కాకుండా పక్కనే ఉన్న నిత్య ఫోటో ని షూట్ చేస్తాడేమో అని ఇంకో అనుమానం..
ఇలా అనుకుంటున్నంతలో రాజ్ నా దగ్గరికొచ్చి కెమెరా నే చూస్తూ మాట్లాడు..అప్పుడప్పుడు అప్పు ని కూడా చూడు...అని చెప్పి వెళ్ళిపోయాడు ..అసలు నేను ఇంక రాజ్ చెప్పిన మొదటి మాట మాత్రమే విన్నాను...మీకర్థంయ్యింది కదా...!!
రాజ్,వంశి ఇంటర్వ్యూ మధ్యలో ఎవ్వరికి వినపడకుండా అప్పుడప్పుడు గుసగుసలాడుకుంటారు..ఇంటర్వ్యూ మొదలు అయ్యింది ...
అప్పు : కిరణ్ మీరు స్టూడియో కి ఎందుకు వచ్చారు ?
నేను : వెర్రి చూపులు ...ఇందు ని మింగేలగా చూస్తూ...
వెంటనే అప్పు : షాక్ అయ్యారా ..??..సరదాకి అడిగాను ..మాకు కారణం తెలుసు లెండి..
నేను : అప్పటికే నా తెల్ల డ్రెస్ చెమటల వల్ల సగం నల్లగా అయిపోయింది...
అప్పు : మీరు బ్లాగ్ మొదలు పెట్టి రెండు సంవత్సరాలు అవుతోంది అంటే ఆశ్చర్యంగా ఉంది..
రాజ్ ,వంశీ : అవునవును ....అప్పటి నుండి భరిస్తున్నాం అంటే ఆశ్చర్యమే మరి..
నేను : :)
అప్పు : ఎలా మొదలయ్యింది మీ బ్లాగ్ ప్రయాణం ?
అప్పు : ఓహ్ ...మీ మొదటి బ్లాగ్ బొమ్మలదా..??
నేను : అవును ఆర్ట్ బ్లాగ్ ..
అప్పు : ఎప్పటి నుండి బొమ్మలు వేస్తున్నారు ...మీకు అసలు బొమ్మలు వేయాలని ఎందుకు అనిపించింది ..?
రాజ్,వంశీ.. : వాళ్ల సోషల్ సర్,వాళ్ల ఫ్రెండ్స్ ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్లి చితక్కోట్టేయాలి...
అప్పు : అవునా మరి మహేష్ బాబు బొమ్మ ఎక్కడ కనపడలేదే ...
నేను : ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రిందట గీస్తే వాళ్ళ నాన్న కృష్ణ లాగా వచ్చాడు ..ఇప్పుడు గీస్తుంటే కూడా అలాగే వస్తున్నాడు .. మహేష్ ముసలాడు అవుతున్నాడేమో ..నేను ఆర్ట్ లో improvement చూపించినా తన మొహం లో కూడా ముసలి కళ పెరుగుతోందేమో ...త్వరలో ..గీసి మీ ముందుకు తీసుకొస్తా ...
రాజ్ : అవసరం లేదూ ..మీ వెనకే పెట్టుకోవచ్చు ...
అప్పు : మీరు బొమ్మలు గీయటం లో మరిన్ని మెళకువలు నేర్చుకొని ....ఎంతో మంచి కళాకారిణి కావాలని ..ఉన్నత శిఖరాలు అధిరోహించాలని .....కోరుకుంటున్నాం ..
రాజ్ : ఇంత తెలుగు కిరణ్ కి అర్థమవుతుందంటావా ??
వంశీ : నాకు డౌటే ...ఆ కళ్ళల్లో చూడు ..నీళ్ళు వస్తున్నాయ్ ..అర్థం కాలేదనుకుంటా ..!!
అప్పు : మీ కోసం ఒక surprise ...!!..అటు చూడండి ..!!...
పక్కనే టీవీ ఆన్ చేసారు ...బొమ్మ రావట్లేదు ..గొంతు వినిపిస్తోంది ...
నేను : అయ్ ..మా బుజ్జి గొంతు :D
రాజ్ ,వంశీ : ఒకరి మొహాలు ఒకరు చూస్కొని ఏమిటో ఈ కిరణ్ కి పొగడ్తకి ..తిట్టుకి కూడా తెలీదు అన్నట్లు మొహాలు పెట్టారు ..
నేను : పైత్యం ఎక్కువయ్యి ...
అప్పు : వెర్రి చూపులు
అప్పు : వేరే వాళ్ళ బ్లాగ్స్ చదివినప్పుడు ఎలా ఫీల్ అవుతారు..??
నేను : ఒక్కొక్కరి భావుకత ఒక్కో రకం...ఒక్కోసారి....కిల కిల నవ్వితే..ఒక్కో సారి మనసంతా భారంగా అయిపోతుంది ..ఒక్కో సారి ఎప్పుడో కలిసిన పాత మిత్రులని కలిసి బోలెడు కబుర్లు ..విశేషాలు ..పంచుకున్నట్లుంటుంది ....మొత్తానికైతే ఒంటరితనం అన్న మాటే మర్చిపోతాం ..
అప్పు : బ్లాగులో నేస్తాలున్నారా ??
నేను : ఎందుకు లేరు మొదట్లో గారు గారు అంటూ పిలిచినా ..ఆ తర్వాత పరిచయమయ్యాక నువ్వు అని పిల్చుకునే చణువు వరకు వచ్చేసాం ..చాలా బాగుంటుంది e-స్నేహం కూడా ...ఒక్కో సారి వారం రోజులు ఎక్కడా కనపడకపోతే...ఎలా ఉన్నావ్ అంటూ వచ్చే పలకరింపులు ఎంత ఆనందాన్నిస్తాయో చెప్పలేం ..
అప్పు : కళ్ళల్లో నీల్లోస్తున్నాయ్ ..మీ మాటలు వింటుంటే (శైలు ,ఇందు కూడా curtain వెనకాల నుంచోని ఏడుస్తున్నారు ...)
వంశీ : ఎహే ..నేను డైరెక్ట్ చేసేది సీరియల్ కాదు ...ఏడవకండి ...ఇందాకే glycerine రాసేస్కున్న్నారా ...???
అప్పు : సరే మీకు మళ్లీ ఓ surprise ...ఈ సారి కూడా ఆడియో రికార్డింగ్ ఏ ..కానీ స్పెషల్ ఎఫ్ఫెక్ట్ టీవీ లో మా తమ్ముడి ఫోటో కనిపిస్తోంది ..
నేను : అమ్మో వీడా ..ఏమేమి నిజాలు చెప్పేస్తాడో ...
నేను : అంతా వాడి అభిమానం ..కళ్ళు తుడుచుకుంటూ
అప్పు : మీరు ఇలాగే సరదాగా కబుర్లు చెప్తూ ..బ్లాగులో బోలెడు టపాలు రాయాలని ..మీ బ్లాగ్ స్నేహితులతో స్నేహం ఎప్పటికి కలకాలం ఉండిపోవాలని కోరుకుంటున్నాం ..
నేను : thank u very much....thanks a lot...
అప్పు : చివరిగా మీ బ్లాగ్ readers కి ఎమన్నా చెప్పాలనుకుంటున్నారా...??
అప్పు : మా స్టూడియో కి వచ్చినందుకు మీకు బోలెడు ధన్యవాదములు ....మా అందరి తరఫున మీ బ్లాగుకి పుట్టిన రోజూ శుభాకాంక్షలు ...
నేను : ఓయ్.. వెన్నెల చూడవే .....నీ birthday celebrations...
అప్పు : ఉండండి కేకు తెచ్చాము ....
శైలు : హా కిరణే ఇందాక ఫోన్ లో అడిగింది ...కేకు కూడా కట్ చేయించండి అని ...
నేను : నమిలి,మింగేసేలా చూస్తూ
శైలు ,వంశీ ,రాజ్ ,అప్పు ,ఇందు ,నేను :
happy birthday to u...
happy birthday to u...vennela....:)
నేను : thank you so much again...!! :)
రాజ్ : ఒక్క ఫోటో చివరిగా ..మీ బ్లాగ్ తో మీకు ...
నేను : అలాగే
రాజ్ : క్లిక్ ...క్లిక్ ...క్లిక్ ..
నేను : ఇంతకీ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు ..??
రాజ్ : ఏంటది ...
నేను : ఇప్పుడు మీరు వీడియో తీసింది ...??
నేను : వాఆఆఆఆఅ..వాఆఆఆఆఅ...వాఆఆఆఆఅ....
శైలు : కిరణ్ అలా ఏడవకు ....ఇదంతా నీ బ్లాగ్ లో నే రాసుకో ......అందరూ చదివి దీవిస్తారు ...
నేను : గుడ్ ఐడియా శైలు ....టాటా :D
ఇందు : కిరణు..కిరణు....నీకు బోలెడు థాంకులు....ప్రశ్నలే కాక జవాబులు కూడా నాతోనే రాయించుకున్నావ్...ఎక్కడ సరిగ్గా పలకవో అని కాస్త కంగారు పడ్డాను...పర్లేదు...బానే మేనేజ్ చేసావ్...
నేను : ఇప్పుడు ఆ విషయం అందరికి తేలియాలా?? ..బాయ్ ఇందు..!!పిల్లలు...శైలు,అప్పు,ఇందు,రాజ్,వంశీ...మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు గాను...నాకు పార్టీ ఇచ్చేయండి :P
అనన్య చురకలు !
మా పాపా పేరు అనన్య ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...
-
నిజంగా ఇది నా బుజ్జే...దీన్ని ఇంట్లో అలాగే పిలుస్తారు..మీరు కుక్క పిల్ల అని తప్పుగా అర్థం చేస్కోకండి ...ఆడపిల్లే..అందమైన తెలివైన ఆడపిల్ల......
-
హ..హా....హా....చ్... శుభమా అని కొత్త సంవత్సరం మొదలవుతూ ఉంటే ఆ తుమ్ములేంటి...?? ఆహా ఒక్క సారికే...నాకు రోజూ తుమ్మోదయమే అవుతోంది మరి... కర్ర...
-
తెల్లవారు జామున ఏడుకి కి అలారం మోగుతోంది ..పొద్దున్నే తొమ్మిదింటికల్లా ఆఫీసు కి వెళ్ళాలని ఎవడు కనిపెట్టాడో కానీ అని అనుకుంటూ నిద్రలేచి గ...