27 June 2011

నా బుజ్జి నేస్తం..

నిజంగా ఇది నా బుజ్జే...దీన్ని ఇంట్లో అలాగే పిలుస్తారు..మీరు కుక్క పిల్ల అని తప్పుగా అర్థం చేస్కోకండి ...ఆడపిల్లే..అందమైన తెలివైన ఆడపిల్ల...
ఎక్కడ పరిచయమో అనే కదా మీ సందేహం..
నేను ఏదో సాధిద్దాం అని హైదరాబాదు లో నారాయణ జూనియర్ కాలేజీ లో చేరిన రోజులు...మా బామ్మ దగ్గర ఉండి చదివేదాన్ని..ఇది ఓ పే..ద్ద తెలివైనదని కాలనీ కాలనీ కోడై కుసేవాళ్ళు...నేను మనుషులనే నమ్మను..సో కోళ్ళని లెక్కే చేయను..దాని గొప్పలు వింటూ వింటూ ఉండగానే ఓ రోజూ ఫిజిక్స్ లో newtons laws గట్టి గట్టిగా విన్నాను..ఏమిటి ఈ పిల్ల కలలోకి newton గాని వచ్చి బెదిరించాడా ఏంటి 108 సార్లు నామ జపం చేయమని అని అనుకున్నా...ఇంతలో మా బామ్మ వచ్చి ..చూడు బుజ్జి ఎంత బాగా చదువుకుంటోందో ...నువ్వు అసలు బైటికే చదవవేంటే అంది..చూడు నా పెతాపం చూపిస్తా అని..రామ రామవ్ రామః అని అరిచా కాసేపు...వెంటనే బామ్మ లోపలికొచ్చి..ఇవి నేను చిన్నప్పటి నుండి వింటున్నా..నేను విననివి చదువు అంది..సరే టాన్ తీటా..కాట్ తీటా అన్నాను...హా ఇవి చదువుకో అంది..నాకు కూడా trignometry అంటే చాలా ఇష్టం..ఆ తీటా లు గురువింద గింజల్లాగా కనిపించేవి.. ఆ తర్వాత కాసేపయ్యాక సౌండ్ ఆగిపోయిందేంటా అని లోపలికొచ్చి చూసారు..గుర్రు పెట్టి నిద్ర పోతున్నాం మనం...చీ ఈ బుజ్జి వల్ల ఇప్పుడు మా బామ్మ వాళ్ళకి నా వీక్ నెస్ తెల్సిపోయిందనుకుంటూ తిట్టుకున్నా..ఇలా ఈ పిల్ల అంటే ఏదో ద్వేషం ఏర్పడింది..

ఓ రోజూ ఏదో చదువుదాం అని పుస్తకం తీస్తే ఏమి ఎక్కట్లేదు..మరుసటి రోజూ పరీక్ష..కళ్ళల్లో నీళ్ళు..ఏమిట్రా నాయన..ఈ గోల..ఇంట్లో అంట్లు తోముకోక అని..ఏడుస్తుంటే..మా పెద్దమ్మ నన్ను గమనించి..ఏమిటి ..ఏమయ్యింది..ఇంటి మీద బెంగా అని అడిగింది...కాదు అని పుస్తకం వైపు చూపించా..ఓహ్..చిరిగిపోయిందా అంది..నోరు తెరవక తప్పలేదు..సగం ఏడుపు గొంతు తో ఈ chemistry నాకు ఏమి అర్థం కావట్లేదు అన్నాను.
ఎవరికి మాత్రం అర్థం అవుతుంది చెప్పండి..ఉదాహరణకి ఇది తీస్కుందాం 6CO2+6H2O ..ఇది చూడండి ...ఎన్ని రకాలు గా ఆలోచించచ్చో..
6CO2+6H2O = 6CO26H2O = alphanumeric ని ఎలా అంటే ఆలా add చేయకూడదు కాబట్టి ఇది రైటు అనిపించింది....కానీ కాదు..:(
6CO2+6H2O =12CO2H20 = సరే ఈ సారికి కలిపేసాను నెంబర్ లు మాత్రమే కలిపాను...ఇది కూడా తప్పంట..:(
మళ్లీ జవాబు చూస్తే ఇదంట C6H12O6+6O2
అసలు ఎక్కడో ఉన్న C H పక్కకి వచ్చేసాయ్..అక్కడ ఇరుగ్గా ఉందో లేక..నెంబర్ లు ఈ అక్షరాలని కరిచాయో -- నాకు చిరాకొచ్చెసీ మోకాలు మీద చెయ్యి వెయ్యంగానే వేడి గా తగులుతోంది...అమ్మో అనుకుంటుండగా....మా పెద్దమ్మ ఉండు బుజ్జి ని అడుగుతా నీకు చెప్పమని అని గోడ దగ్గరికి వెళ్లి..ఏమ్మా బుజ్జీ..కాస్త బైటికి రావూ అంది..అది వచ్చింది..నా గురంచి మా పెద్దమ్మ - మా మరిది గారి అమ్మాయి..ఊరి నుండి వచ్చింది..హైదరాబాదు చదువులు తట్టుకోలేక పోతోంది..ఆ ఇంగ్లీషు కూడా అర్థం అవుతోందో లేదో అనింది...వామ్మో పెద్దమ్మ నువ్వాపేయ్...నన్ను ఎర్ర బస్సు నుండి ఇప్పుడే దిగిన గొర్రె పిల్ల ని పరిచయం చేసినట్లు చేసేస్తున్నావ్..నువ్వు పోయి వంట చేస్కో అని పంపేసి..నేను ఏదో కవరింగ్ చేస్కొని పరిచయాలు మళ్లీ మొదలెట్టి..గొర్రె కాదు..మనిషి అని రుజువు చేస్కున్నాక నా సందేహం తీర్చుకున్నా..ఆ తర్వాత నేను కూడా కోడినయిపోయా..:P..కొన్ని నిజాలు ఒప్పుకోక తప్పదండి..అలా నాకు అర్థం కానివి దానితో వివరణ ఇప్పించుకుంటూ వాళ్ల ఇంట్లో వాళ్ల మేడ మీద బోలెడంత సమయం గడిపేవాళ్ళం..ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళు చాలా బాధ పడ్డారు..అనవసరంగా ఈ కిరణ్ కి బుజ్జి ని పరిచయం చేసాం..చదువు తక్కువ కబుర్లు ఎక్కువ అయిపోయాయి అని.. :P

కానీ మేము ఆపలేదు గా...రోజూ సాయంత్రం కాలేజీ నుండి రాంగానే గబా గబా తయారయ్యి ఓ పుస్తకం తీస్కోని మేడ మీదకెళ్ళి పుస్తకాలు పక్కన పెట్టి కబుర్లు చెప్పుకునే వాళ్ళం..ఆకాశం కూడా మా కోసం రోజుకో కొత్త రంగు తో ముస్తాబయ్యి ఎదురు చూసేది..6.30 కి బోలెడు పక్షులు వరుసగా వెళ్ళేవి..అవంటే నాకు బోలెడు ఇష్టం..నేను పొరపాటున వాటిని ఎక్కడ చూడనో అని..కిరణ్ నీ పక్షులు..అని అరిచేది..ఇక చీకటి పడుతోందంటే నాకు భయం..చుక్కలోచ్చేస్తాయి..ఇక ఆకాశం లోకి చూపిస్తూ ఏదేదో చెప్పేది..బుజ్జి డార్లింగ్ ..నువ్వు సూపరహే ..నన్ను వదిలేయ్యవే అంటే..నా టాలెంట్ చూసి ఈ మాట అనాలి ...ముందే అంటే నా మనసు ఒప్పుకోదు..అని గట్టిగా పట్టుకుని..కిరణు..నా బంగారు కిరణు నువ్వు కూడా చూడవా అనేది..అలా దాని మీద జాలి తో నేను బలయ్యేదాన్ని...ఎనిమిదింటికి మా ఇంటి నుండి కేక విన్పించేది..భోజనానికి..నేను ఇక పరుగో పరుగు...ఇలా బోలెడు సాయంత్రాలు.. :)..అంత సేపు మాట్లాడినా మళ్లీ అన్నం తిన్నాక ఇంకో సారి వాళ్ల గోడ దగ్గరికెళ్ళి బుజ్జా ..బుజ్జా..అని అరిచేదాన్ని...మొదట్లో ఓ సారి వాళ్ల అమ్మ గారు పొద్దున్న మిగిలిన అన్నం పట్టుకోస్తూ బుజ్జి నువ్వు కాలనీ లో వీళ్ళకి కి కూడా తెలుసా అన్నారు...ఇంతలో గేటు తెరుస్తూ అరిచిన వాళ్ల కోసం వెతుకుతున్నారు..ఆంటీ...నేను ఆంటీ కిరణ్ ని అన్నాను...నువ్వా అమ్మా..అంటూ లోపలికెళ్ళి కిరణే బుజ్జి.. వెళ్ళు అన్నారు...నేను తల దించుకుని...టోను బాడ్ అని తెలుసు కానీ మరీ ఇంత స్టోనా అనుకునే లోపు ఇదొచ్చి సోది మొదలెట్టింది..ఇంతలో దోమలోచ్చేస్తాయి...బాగా కుట్టేస్తాయి నన్ను..మా బుజ్జి ని కుట్టవు...ఎందుకంటే పైన ఫోటో చూడండి..నేను షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటా...మా బుజ్జి లాంగ్ అండ్ సాల్ట్..అందుకే అవి నా కాళ్ళను నమిలి మింగేసేవి..కానీ బుజ్జి కోసం నించునే దాన్ని..!!


బుజ్జి బాగా అలవాటయిపోయింది..ఓ రోజూ వచ్చి..నేను IIT కోచింగ్ తీస్కోడానికి వెళ్తున్నా అనింది...ఇక కొన్ని రోజులు హాస్టల్ అని అనింది..:(....నేను బాగా ఎడిసాను(ఇప్పుడు ఇలా : దీని కోసమా ఛి..ఛి .. :P) ..ఆ రోజూ బాగా గుర్తు నేను స్టైల్ గా నా జుట్టు కట్ చేయించుకుంటున్నా కదా. అని తెగ ఫోసు కొట్టుకుంటూ వెళ్ళిన బుజ్జి..కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకోచ్చింది..ఎందుకే అంటే..నేను కొంచం అంటే ఆవిడ మొత్తం చేసేసిందే..అసలు రబ్బర్ బ్యాండ్ పెట్టుకోడానికి కూడా లేకుండా అని..పోన్లే రబ్బర్ బ్యాండ్ కొనే పని తగ్గిపోయింది గా అంటే..వెనక్కి తిరిగి చీపురు వైపు చూసింది..మళ్లీ ముందుకు తిరిగితే నేను లేను.. :P...పైన ఫోటో చూడండి..నాది వాలు జడ...మా బుజ్జి ది గుర్రం తోక చివర ఉంటుందే అలా లేదూ .. :P

ఇంటర్ అయిపోయి b .tech చేరినప్పుడు చెరో ఊరు పడ్డాం..మరీ ఉండద్దేటి ఆ మాత్రం వ్యత్యాసం...నేనే త్యాగం చేశా మా బుజ్జి కోసం..ఏ ఊరిలొ లో వాళ్ళు ఆ ఊరిలొనే ఉండాలి..మళ్లీ ఇంజనీరింగ్ సీట్ మా ఊరిలొ వచ్చింది.. b .tech లో ఉండగా బోలెడు ఉత్తరాలు..కనీసం వారానికి ఒకటి..రాయకపోతే తిడ్తూ ఒక line రాసేది..నాకు ఉత్తరం రాయి అని...నేను ఇలా బ్లాగు లో పేరాలు పేరాలు రాసినట్లు ఉత్తరాలు రాస్తే ...దాని ఉత్తరం మీరు పెట్టే కామెంట్ల సైజు లో ఉండేవి ..మధ్యలో సెలవలకి హైదరాబాదు వెళ్లినప్పుడు వాళ్ల కాలేజీ కి తీసుకెళ్ళి పరిచయం చేస్తూ ఇదే మా కిరణు..నాకు పెద్ద పెద్ద ఉత్తరాలు రాస్తుంది..నేను క్లాసు జరిగేటప్పుడు వాటిని చదువుతూ నవ్వుకుంటూ ఉంటా అని ఓ చెప్పేసింది..ఒసేయ్ నువ్వు తిడ్తున్నావా..పొగుడుతున్నావా..కాస్త అర్థమయ్యేలా మాట్లాడవే అనుకున్నా..!!..నా గురించి బాగా తెలిసిన వ్యక్తి నా బుజ్జి..:)..నేనంటే పిచ్చ ఇష్టం..:)(ఇది నిజం ..సొంత డబ్బా కాదు ..ఎందుకంటే I LOVE U అని చాలా సార్లు మెసేజ్ పెట్టింది :))

రెండు వారాల కిందట నాకు పెళ్లి కుదిరిందే అని ఫోన్ చేసింది..బుజ్జీ..కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటే ఇదే అనుకుంటా అన్నాను..నా డవిలోగు కి....దానికి కక్కొచ్చి ఫోన్ పెట్టేసింది..తర్వాత రెండు రోజులకి ఫోన్ చేసి...చాలా దిగులుగా మాట్లాడింది..బుజ్జి కన్నా దిగులు గా ఉందా అన్నాను..అంతే...గట్టిగా ఏడ్చేసింది..నేను మెయిన్ రోడ్ మీద బస్సు స్టాప్ లో ఉన్నాను అసలు ఏమి ఆలోచించ లేదు ....కళ్ళల్లో నీళ్ళు కారిపోయాయి...నా పెళ్ళికి తప్పకుండా వస్తావు కదూ..నా పక్కనే ఉంటావు కదూ అని ఎంత ముద్దు గా పిలిచిందో..:)..నేను నా మనసుకు దగ్గర గా ఉన్న స్నేహితుల పెళ్ళిళ్ళు అన్ని హాజరయ్యాను ..ఒక రెండేళ్ళ క్రితం ఇంకో నేస్తం పెళ్లి అయ్యింది ..అప్పుడు ఏదో మిస్ అవుతున్నాం అనిపించింది...దాని కన్యాదానం అప్పుడు నేను వెక్కి వెక్కి ఏడ్చాను...ఏమిటో దూరం అవుతుందని ఎంత బాధ పడ్డానో రెండు రోజులు ఒకటే కలవరం ..కొత్త ఇల్లు కొత్త మనుషులు ఎలా సర్దుకుం తోందో ఏంటో అని ..మా స్నేహితులు..అది ఏడవడం ఆపేసిందంటా..ఇంక నువ్వు ఆపేయి అన్నారు..:P..కానీ దీనికి పెళ్లి కుదిరింది అన్నప్పటి నుండి నాకే ఏదో దిగులు ..భయం ..కంగారు ....అసలు నేను దానికి ఫోన్ కూడా చేయలేదు ..ఎక్కడ నా బాధ బైట పెట్టేస్తానో అని..!!...

ఇది నా నేస్తం అని చెప్పడం కంటే కూడా మార్గ దర్శి అని చెప్పడం ఏమాత్రం పెద్ద పదం కాదు...!!నాకు ఉన్న ఒక్క అలవాటు చిత్ర లేఖనం ..నాకు బోర్ కొట్టినప్పుడల్లా ఇది ఒక్కటే చేసేదాన్ని..మొదటి సారి పుస్తక పఠనం కూడా బాగుంటుంది అంటూ Alchemist పుస్తకం ఇచ్చి చదివించింది..!!బంగారు రోజులు...ఒక వేళ నా స్వీయ చరిత్ర(భయపడకండి నాది రక్త చరిత్ర కాదు..ఐనా అంత ఓపిక లేదు) రాసుకుంటే రంగుల రంగుల కాగితాల్లో ఈ నేస్తం గురించి రాసుకో దగ్గ స్నేహం మాది ...!!నాకు అనుకోకుండా భగవద్గీత టీచర్ ని పరిచయం చేసింది....ఇష్టం అని అది భగవద్గీత నాకు తీసుకొచ్చి మా గురువు చేతే ఇప్పించింది ..నేను అన్నా ఎక్కడైనా సరదాకన్న ..లేక కోపం లో అన్నా దాని గురించి తక్కువ గా మాట్లాడానేమో కానీ అది ఏ రోజూ నా గురించి ఒక్కసారి కూడా తప్పుగా మాట్లాడలేదు ...!!

తనకి పెళ్ళయిపోయింది..ఏదో పనులు చేస్కొడానికి కష్ట పడ్తుంటే మనం వెళ్లి దాని కష్టాలు చూసి ఆనందించే ఛాన్స్ ఇవ్వదండి ఇది..నా ఉద్దేశం లో ఇది పూర్వజన్మ లో పెద్ద బంగ్లా లో పనిమనిషి..అక్కడ కాస్త కూడా ఖాలీ లేకుండా పని చేసి..చేసి...ఈ జన్మ లో కూడా..వారంతం వస్తే బట్టలు ఉతకాలి..అలమరా సర్దాలి..తుడిచిందే తుడవాలి అనే రకం...పని వంతురాలు..నేను సర్టిఫికేట్ ఇచ్చాను గాని..మీరు కనీసం శుభాకాంక్షలు తెలపండి...

తన పెళ్లి అయ్యి వారం అయిన తర్వాత టపా వేసేంత బిజీ అయిపోయాను నేను...
ఎలా అయితే ఏంటి మా బుజ్జి ని ఆశీర్వదిస్తూ అభినందనలు తెలపండి...తన జీవితం ఎప్పుడూ రంగుల మయంగా..ఆనందంగా ఉండాలని దీవించేయండి..
మీ లాంటి పెద్ద వాళ్ళు..మంచి వాళ్ళు...(వెనక్కి చూస్కుంటారెంటి ..?..మిమ్మల్నే) అభినందిస్తే మంచి జరుగుతుంది అంట..అద్ది విషయం..:)

Happy married life Bujji darling..:)Love u soo much..!! :)

12 June 2011

పొగ..

ఏం పొగ ..పొయ్యి నుండి వచ్చే పొగ అనుకునేరు....మనకి చిన్నప్పటి నుండి కూడా చాలా తెలివి ..వంటింటి పక్కకే వెళ్ళకపోతే ఇక ఆ పొగ వల్ల ఏం ఇబ్బందులే లేవు కదా ..

ఇది సిగరెట్టు పొగ ..మా ఇంట్లో ఎవరూ తాగరు ..మా తాతయ్య (అమ్మ వల్ల నాన్న ) తప్ప ...చిన్నప్పుడు అపుడప్పుడు ..సెలవలకు వెళ్ళినప్పుడు అంత తెలిసేది కాదు ..నేను హై స్కూల్ మా అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకున్నా కదా ..అప్పుడు తెలిసొచ్చింది ..బాగా ...ఆయన సిగరెట్టు తాగి ఇంట్లోకి రాంగానే గుప్పు గుప్పు మని వాసన...నోరు తెరచి మాట్లాడుతుంటే ఇక భరించలేం ....తాతయ్య అంటే అందరికి బాగా భయం..ఎవరూ ఒక్క సారి కూడా తాగద్దు అని మాట వరసకు కూడా చెప్పడానికి సాహసం చేయలేదు ..నాకు ఓ రోజు బాగా కడుపులో తిప్పేసి తిన్నదంతా బైటికి వచ్చేసి ..వాటి తో పాటు ఓ రెండు నరాలు కూడా పడి పోయాయేమో గమనించలేదు ....కళ్ళల్లో నీళ్ళు వచ్చేలా డోక్కున్నా ...ఇలా కాదని ..మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాను ..అమ్మమ్మ ..ఎప్పుడూ చెప్పలేదా నువ్వు తాతయ్యకు ఇలా సిగరెట్టు కాల్చద్దు అని ...అమ్మో నేనా ..లేదు.. ఒక్క సారి చెప్పా ...నీ లాగే బక్క కదా మీ తాతయ్య ...బక్క కోపం చూపిస్తూ ఊగిపోతూ పక్క గదిలోకి వెళ్ళిపోయారు అంది ...తన శక్తి మేరకు ఈ విషయం లో మా అమ్మమ్మ.. తాతయ్య మీద కోపాన్ని బయట పెట్టినట్లే...మా పెద్దమ్మల్ని..మా పిన్ని ని ,అమ్మని అడిగా మీరు అని ...లేదమ్మా ..అయినా ఈ వారానికే నీకు అంత విసుగు ఏంటే ....అంటే ...మీకు తెలీదు ...ఈ రోజు నరాలు ..రేపు బొమికెలు ఇలాగే రోజుకొకటి నా నోట్లో నుండి పోతూ ఉంటాయి...మీరు చూస్తూ ఉంటారు అన్నాను...!!వాళ్ళు నీ మొహం లే అలవాటు అవుతుంది ..వెళ్లి ఆ sandal talc పౌడర్ ఒక రుమాలు మీద చల్లుకుని దగ్గరెట్టుకో అని ఓ సలహా పడేశారు...
ఒహ్హూ వీళ్ళు అందుకేనా పౌడర్ మీద పడినా కూడా సరిగ్గా దులుపు కోకుండా తిరేగేస్తున్నారు అనుకున్నా..!!

లేదు ..తేవాలి ..మార్పు తేవాలి అంటూ ..ఆవేశం తో ..ఆ రోజు నుండి మా తాతయ్య ని గమనించడం మొదలెట్టా ...ఆయన లేవగానే మొహం కడుక్కోక ముందొకటి ..తర్వాత ఒకటి ..టిఫిన్ తిన్నాక ఒకటి ..మధ్య లో ఒకటి ...భోజనం ముందొకటి ..తర్వాత ఒకటి .ఇలా అబ్బో ....పెట్టెలు పెట్టెలు అయిపోగోట్టే వాళ్ళు ..ఒక రోజు సిగరెట్టు పెట్టె నేను తీస్కెళ్ళి చెత్త బుట్ట లో వేసేసా.. ఇది ఎవరికీ తెలీదు ...మా అమ్మమ్మ టైం బాలేక ఆ రోజు దాన్ని మా తాతయ్య చూసేసారు ...ఎవరు దాన్ని అలా పడేసింది ..ఇన్ని ఏళ్ళు లేనిది ఏమిటిది కొత్తగా అంటూ అమ్మమ్మ మీద కోప్పడ్డారు ...కింద పడితే పనమ్మాయి ఊడ్చెసిందేమో లే అని అమ్మమ్మ చెప్పింది ...సాయంత్రం ఆ పనమ్మాయి కుక్క తోక తొక్కి ఇంటికి వచ్చి ..మా తాతయ్య దగ్గర అక్షింతలు వేయించుకుంది.అన్ని అరిచారా...చూస్తే వెంటనే తన అల్మారా లో ఇంకో రెండు పెట్టెలు ఉన్నాయి ...అబ్బో బ్యాక్ అప్ అనుకున్నా ..ఇలానే ఆలోచిస్తూ నా బాధని మా తమ్ముడితో వ్యక్తపరుచుకున్నా...!! అక్కయ్యా ...ఏంటి తప్పు సిగరెట్టు కాలిస్తే అని ఓ సందేహం బయట పెట్టాడు...మనం షిరిడి సాయిబాబా లాగా చెయ్యి పైకి పెట్టి ఏదో ఉపదేశిస్తున్నట్లు ...అందులో tobacco ఉంటుంది రా అన్నాను ..పేరు భలే ఉందే ....సరేలే అది ఉంటే ఏం చేస్తుంది ...అన్నాడు ...ఆ రోజు దాని గురించి క్లాసు లో చెప్తుంటే నేను నిద్ర పోతున్నా ..మా సర్ ఏం చెప్పారో నాకు గుర్తు లేదు ...వాడికి అదే చెప్తే చులకన అవుతా...అందుకే కిడ్నీ అని ఒకటి ఉంటుంది..అది పాడయిపోతుంది అని చెప్పాను ..అవునా...సరే మరి ఎలా? ..తాతయ్య మనకు బోలెడు ఐస్క్రీం లు కొనియ్యాలి ... ఈయనకి ఆ జ్వరం వస్తే...ఈ అమ్మ...పెద్దమ్మ వాళ్ళు బఠానీలు కూడా కొనివ్వరు అక్కయ్యా అన్నాడు ...ఒహ్హో ..వీడు ఈ కోణం లో ఆలోచిస్తున్నాడా అనుకోని ..సరే నువ్వు ఈ రోజు నుండి తాతయ్య ఎన్ని సిగరెట్లు కాలుస్తున్నారో కనుక్కో అన్నాను ...వాడు CID లాగా investigation మొదలెట్టాడు ..నాకు తెలియని ఒక ఆసక్తి కరమైన నిజాన్ని కనుక్కున్నాడు ..ఏంటి అంటే ముద్దగన్నేరు చెట్టు దగ్గర గూట్లో సగం కాల్చిన సిగరెట్టు పైన ఏదో ప్లాస్టిక్ దాంట్లో సిగరెట్టు దాచుకుని..మళ్లీ కావలసినప్పుడు వెళ్లి తాగుతున్నారు అని ..అది ఏంటి అని వెళ్లి అమ్మమ్మని అడిగితే ..మీ చిన్న తాతయ్య అమెరికా నుండి ..అన్న ఋణం తీర్చుకోడానికి ఇది గిఫ్ట్ గా పంపాడు ...ఈ అన్న సోదరోత్సాహం తో పొంగి పోతున్నారు అంది ...ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనుకుంటూ నేను తంబి బైటికి వచ్చి ...ఆ ఫిల్టర్ ని బయట పడేసాం...తాతయ్య ..ఆ రోజు మళ్లీ అరిచారు ..ఎవరూ తీసారు ఎక్కడ పడేశారు అని ..ఈ తమ్ముడు పిరికి వెధవ...సత్య హరిశ్చంద్రుడి కజిన్ సిస్టర్ కిరణ్ తమ్ముడిలా ...నిజాలు చెప్పేసాడు ....అక్క ,నేను అని ...మా తాతయ్య ..మా అమ్మని పిలిచి ..ఇంకో సారి వీళ్ళను అక్కడికి పంపద్దు అని చెప్పి వెళ్ళిపోయారు అందరూ వంటిట్లో తిష్ట వేసుంటారు...అక్కడికి పిలిచి బాగా కాల్చిన అట్లకాడ చూపిస్తూ అటు పక్కకి పోయారంటే.. ఇది మీ చేతి మీద , కాళ్ళ మీద ఉంటుంది అని బెదిరించి పంపేసారు..ఆడవాళ్ళ దౌర్జన్యం నశించాలి అంటూ వంటింటి బైటికి వస్తూ తమ్ముడి వైపు చూసా..అవును నశించాలి అన్నాడు ....!!పర్లే కంట్రోల్ లో ఉన్నాడు అనుకున్నా...!!

మరుసటి రోజు SUPW period లో అన్ని క్లాసు వాళ్ళని కలిపి గ్రౌండ్ లో కూర్చో పెట్టారు ...మా తమ్ముడు గాడు కూడా అక్కడే ఉన్నాడు ....మా సైన్సు సర్ ఓ చెట్టు పక్కన కూర్చున్నారు. ఆయన పక్కన వీడు ...ఆయనకి కాస్త సందు దొరికి వెళ్లి సిగరెట్టు కాల్చేసి వచ్చారు ..వీడు ఆయనని పిలిచి ...smoking is bad for health sir..dnt smoke..ur kidneys will fail అన్నాడు. ఆయన ఎవరు ఇచ్చారు ఇంత జ్ఞానం అని అడిగితే చక్కగా కాస్త కూడా జాలి లేకుండా నా వైపు వేలు చూపించాడు ...ఓహ్ ...తను మీ అక్క కదా అన్నారు ఆయన ..హా అవును అంటూ తల ఊపాడు...మొదటి బెంచులోనే కూర్చుని నిద్ర పోతున్నావా ..నిన్న పాఠం లో ఏం చెప్పా అన్నారు ఆయన ...ఎంతో నమ్మకంగా కిడ్నీ అన్నాను ..అందరూ గొల్లు మని నవ్వారు ..ఎందుకో అనుకుంటే ..కిడ్నీ కాదంట ..లంగ్స్ అంట ..ఏదైతే ఏం లే ఎప్పుడూ వాటిని బైట చూడలేదు గా ఆ మాత్రం తిక మక పడితే పర్లేదు అని నాకు నేను సర్ది చెప్పుకుని మా సర్ మొహాన్ని నా మొహం దీనాతి ధీనంగా పెట్టి చూస్తుంటే ..రేపటి నుండి ...నేను చెప్పిందంతా క్లాసు అయి పోయాక నాకు చెప్పాలి అన్నారు ..మా తమ్ముడిని మింగేసేలా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోయా ...!!...ఇంతకీ మా సైన్సు టీచర్ కూడా అన్ని పాఠాలు చెప్తూ మానలేక పోయారు ....ఇంక మా తాతయ్య ఎంత లే అని ఊర్కున్నాం...!!

ఇంట్లో కాస్త కాస్త అలవాటయ్యింది ..కానీ బజార్ లో అందరూ ఒకటే చోట తాగుతుంటే అటు నుండి వెళ్తే మళ్లీ నరాలు,బొమికెలు బైట పడేవి ..ఇదేమిటి ఇన్నేళ్ళు అలవాటు కాలేదా అనకండి ..ఒక్క సిగరెట్టు వాసనే అలవాటైంది ..పది సిగరెట్ల వాసన అలవాటు కాలేదు ..లాజిక్ అర్థమైందా !

కానీ ఎక్కడా ఎవర్ని మార్చ లేకపోయా ..ఇలా బాధ పడిపోతూ నేను ఎదిగాను ...అలాగే బాగా ఎదిగిన స్నేహితులు పరిచయమయ్యారు..

ఎలా ఎదిగారో తెల్సా ..మా గ్యాంగ్ లో ఒకబ్బాయికి సిగరెట్టు తాగే అలవాటు ఉండేది ...మున్నా ప్లీజ్ మానేయి అని ఓ సారి చెప్పా ....చూద్దాం లే అని ఊర్కున్నాడు...మిగితా వాళ్ళని తిట్టా.. ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు ....ఆ మాత్రం స్నేహితుడితో ఒక అలవాటు మాన్పించలేరా అని...ఆ ఘనత మాకెందుకు ..నీకే దక్కనీ అని వాళ్ళు భారం నా మీద పడేశారు ...ఓ రోజు నేను పిలిచి క్లాసు పీకా ..మున్నా సిగరెట్టు వద్దు ...అది తాగకుండా బతకలేవా అని ..కిరణ్ ఒక్కటే అడుగుతా..నువ్వు ఉపిరి పీల్చకుండా ఉంటావా అని ...ఇప్పుడు నిన్ను తన్నకుండా మాత్రం ఉండలేను అన్నాను ..సరే కానీ ఓ పెన్ను పేపరు పట్టుకురా అన్నాడు ..ఈ జీవికి ఏదైనా అలా వివరించడం అదో అలవాటు ...తీస్కోచ్చా...ఓ పేరు రాసి ..ఈయన ఎవరు అన్నాడు ..పాపం మీ నాన్నగారు అన్నాను ...హా ఈయన ఉద్యోగం వచ్చాక మానేసారుట ..అని ఇంకొక పేరు రాసాడు ...మీ అన్న అన్నాను ..వీడు వాడికి ఉద్యోగం వచ్చాక మానేసాడంట...అని మున్న అని రాసాడు ...నాకు విషయం అర్థమైంది ...!!ఛి మారవు పో అని తిట్టాను ...అలిగాను ..కోప్పడ్డాను ..ఏవీ పని చేయలేదు ..ఇలాక్కదని మా నాన్నకి చెప్పాను ...మున్నా సంగతి చూడండి అని ....ఓ రోజు ఇంటికి వచ్చి వెళ్తూ కిరణ్ ఓ 3 rs change అన్నాడు ...నాన్న వెంటనే ఏ కింగ్ సైజు తాగడం మానేశావా మున్నా అన్నారు ....హుహ్హుహుహుహుహ ...నేను పక్క గదిలో ఉండి పడి పడి నవ్వుతున్న్నా ...కిరణ్ బాయ్ రేపు కాలేజీ లో కలుద్దాం అని వెళ్ళిపోయాడు వెనక్కి తిరగకుండా ...

తనకు ఎప్పుడూ ఉద్యోగం వస్తుందో అనుకుంటూ ...b.tech ఐపోయాక అందరం ఉద్యోగ వేట లో పడ్డాం ...చూస్తే ..ఓ రోజు నేను 1st రౌండ్ లో సెలెక్ట్ అయ్యాను ...ఆ తర్వాత గ్రూప్ discussion ..అక్కడ టాపిక్..will u suport smoking in public places..అని ..మొత్తం పది మంది ...అందులో ఇద్దరమే అమ్మాయిలు ...ఇంక అందరూ అబ్బాయిలే ..బండ గొంతేస్కుని తాగొచ్చు ఏం కాదు అని వాళ్ళు..నేను ఏం కాదు పబ్లిక్ ప్లేసెస్ లో నే కాదు..ఎక్కడ తాగకూడదు అని ..అందులో ఓ అబ్బాయి చాలా కోపంగా చూసాడు ....ఆ discussion కర్రెస్ట్ గా 3 నిముషాలు జరిగింది ...ఇంతలో రిజల్ట్స్ అవుట్ ..మనం కూడా అవుట్ ...ఆ కోపంగా చూసిన అబ్బాయి ఎక్కడ వచ్చి కొడతాడో అని భయం తో నా పక్కనున్న పిల్లతో మాటలు కలిపా ...ఎందుకు మాట్లాడలేదు ఒక్క మాట కూడా అన్నాను ...ఛి అసహ్యంగా మనం సిగరెట్ల గురించి మాట్లాడటం ఏంటి అనింది ..అమ్మా భారత నారీమణి!!..అని ఓ నిమిషం మనసులో అనుకుని ఆ పిల్లని ఒక సారి అసహ్యంగా చూసి మా అన్నకి కాల్ చేశా ..(మరి ఇక్కడికి తీస్కొచ్చింది అన్నయ్యే) ...ఎక్కడున్నావ్ ..అని ...సందు చివర ..ఇంక లోపలికి పిలవలేదా అన్నాడు ....అన్నా ఈ చెల్లలి మీద నీకు నమ్మకం ఎక్కువ ...నువ్ ఎనక్కి వచ్చెయ్యి అన్నాను ..ఏమైందే అంటే ....వాళ్ళు బయటకి పంపించేసారు...అన్నయ్య.. ..ఇంకేక్కడన్నా ఓపెనింగ్స్ ఉన్నాయా అన్నాను ..అక్కడే ఉండు కమింగ్ అన్నాడు ....వచ్చి బండి ఆపి నన్ను డ్రైవర్ లాగా భలే యుటిలైస్ చేస్కుంటున్నావే అన్నాడు ...నీ బండిలో వచ్చే పోయింది అన్నాను ....ఏం మాట్లాడకుండా ఇంట్లో దించి మా పెద్దమ్మ కి వార్నింగ్ ఇచ్చాడు ...అది నా బండి తుడవడానికి కూడా వీల్లేదు అని ..

పైన అన్ని జరిగినా ఇంకా సిగరెట్టు తాగే వాళ్ల చేత ఆ అలవాటు మన్పించాలనే నా కోరిక తీరలేదు...:(..

మొన్న రెండు వారాల కిందట మా పెదనాన్న గారింటికి వెళ్ళాను..అక్కడ వాళ్ల మామ గారు ఉన్నారు ...ఎనభయ్ ఏళ్ళు..చెయిన్ స్మోకర్.....ఆయనకి పాపం కింద పడి చేయి విరిగింది...పెద్ద కట్టు కట్టించుకున్నారు..కానీ సిగరెట్టు తాగాలనే ఆశ మాత్రం ఉంది...మా తమ్ముళ్ళని,పెదనాన్న ని మా పెద్దమ్మ.. కాస్త తాత గారికి సిగరెట్లు తెచ్చి పెట్టండర్రా అని అడిగింది..నో నహి అన్నారు..నా వైపు చూసింది...నేను యాంటి స్మోకర్స్ అస్సోసియేషన్ కి అధ్యక్షురాలిని..అన్నాను..నువ్వు కూడా ఎదురు చెప్తున్నావా..సరే మనిద్దరం సాయంత్రం బజార్ లోకి వెళ్తాం కదా..అక్కడ నేను అడుగుతాలే అంది..ఇంతలో మా తమ్ముడు(పెదనాన్న వాళ్ల అబ్బాయి ) వచ్చి వాళ్ల అమ్మని నాకు తాగాలని ఉందే అన్నాడు....అప్పుడే మా కోసం పకోడీలు చేస్తూ ఉంది..ఆ గరిటె తీసి వాత పెట్టాలని ఉందిరా..ఎవరికి పెట్టాను అంది??..వాడు మాట మార్చేసి..నాన్న ఎప్పుడైనా తాగారేమో తెల్సా నీకు అని అడిగాడు..ఛి ఛి మీ నాన్న అలా ఎప్పుడూ చేయలేదు ..చేసుండరు అంది..వెంటనే మా బామ్మోచ్చి..చిన్నప్పుడు కాల్చడానికి ప్రయత్నించాడు..కానీ తాత గారు వద్దని చెప్పడం తో మానేసాడు...అని అంది..మా పెద్దమ్మ అదేలే 6 ,7 వయస్సులో అంది...మా బామ్మ ఏం నా కొడుకు అంత చిన్న వయసులో అలా చేస్తాడని నీ ఉద్దేశమా అంది...ఈ సీన్ మార్చేయడానికి మా వాడు ఓ సిగరెట్టు తీస్కోని నోట్లో పెట్టుకుని...ఎటు వైపు వెలిగించాలో అన్నాడు..చాలా ఎక్కువ చేస్తున్నావు రా..మరి అంత నటించకు అన్నాను..అయితే వాకే అక్క..అంటూ లేచాడు...అది కాస్త నా వాళ్ళో పడింది..చ..చ..అంటూ లేచాను..ఆ తాత గారికి కోపం వచ్చి..ఏమ్మా అంత అసహ్యం ఏంటి నేను తాగాట్లేదా అన్నారు(వాళ్ళ ఆవిడను తిట్టినా ఇంత ఫీల్ అయ్యేవారు కాదేమో..)..నేను తెలివిగా ..పెద్దమ్మ.. దా బజార్ కి వెళ్దాం..అని అక్కడ నుండి బయట పడ్డాను..

సరే షాప్ కి వెళ్లాం..చార్మినార్ సిగరెట్టు పెట్టె అంది..ఆ షాప్ అతను ఒక్క సారి తల పైకి ఎత్తి చూసాడు...ఏమిటీ ఆడవాళ్ళు అడుగుతున్నారు అని...నాకు నవ్వు ఆగట్లేదు..నవ్వుదాం అంటే భయం..అప్పుడే పెద్దమ్మ కొత్తబట్టలు కొనిచ్చింది..లాగేస్కుంటుందేమో అని...ఆ డ్రెస్ కలర్ కూడా నాకు బాగా నచ్చింది...ఇక ఆవిడే మా నాన్న గారు చాలా పెద్ద వారండి..ఇప్పుడు వంట్లో బాలేదు..కానీ దీనికి బాగా అలవాటు పడ్డారు...ఇంట్లో పిల్లల్ని అడిగితే వాళ్ళకి మొహమాటం వాళ్ళు అడగనన్నారు...మరి నాకు తప్పదు కదా అని ఆ షాప్ వాళ్ళకి చెప్పింది...అందులో ఆ షాప్ లో ఆయన భార్య..అయ్యో ఈ కాలం పిల్లలు ఇంత చవకవి తాగరు అండి...ఒకొక్క సిగరెట్టు 8 రూపాయలు ..దాని పేరు black అని తీసి చూపించింది..అది నాకంటే పోడుగుంది..కర్రి గా కూడా ఉంది...నాకు నవ్వు ఆగట్లే..చూసావా కిరణు..8 రూపాయలంట అంది మా పెద్దమ్మ..నాకు 5 రూపాయలది తెల్సు అన్నాను...ఆ అదెలా అంది..వెంటనే నాలుక్కరచుకొని...మున్నాని తిట్టుకొని...ఏదో లే ఆఫీసు లో మాట్లాడుకుంటే విన్నా అని కవర్ చేసేసా...

వాటిని నేనే ఆ తాత గారికి ఇస్తూ..మానేయండి అన్నాను...చూడు నాన్నా కిరణు నాకు ఎనభయ్ ఏళ్ళు...ఇంకెన్నాళ్ళు బతుకుతా...ఈ కొంచెం కాలం కోసం ఎందుకు మానేయాలి అన్నారు...ఏమో ఏం చెప్పాలో తెలీలేదు ...!!

వ్యసనం అలాంటిదేమో మనందరికీ బ్లాగ్గింగ్ లాగా..

5 June 2011

కాళ్ళు - జీతం

ఒక రెండు,మూడు నెలలు గా ఎంత పాజిటివ్ గా ఉందాము అన్నా ఏదో ఒక ఎదురు దెబ్బ తగలడం తో విసుగ్గా అనిపిస్తోంది ..!!

కానీ ఒక్క నిమిషం కూర్చుని ఆలోచించా ..ఎందుకు అంత విసుగు చిరాకు ...చాలా విషయాలు ఉన్నా..ప్రస్తుతం అయితే ఉద్యోగం వల్లే కదా!!అన్నన్ని వేలు ఇచ్చే ఉద్యోగం లో ఈ మాత్రం చిరాకులు ఉండటం సర్వ సాధారణం అనుకుంటూ నాకు నేను చెప్పుకున్నా ....మళ్లీ ఒక్క నిమిషం ఇలా అనిపించింది ..డబ్బు తీస్కుని అవసరాలకు వాడుకుంటూ సాఫీ గా సాగి పోయే కెరీర్ కావాలనుకోడం లో స్వార్థం ఉందేమో ..ఎంత మందికి అవసరాలకి డబ్బు లేక ఇబ్బందులు పడ్తున్నారో ..ఇలాంటి పరిస్థితిని నాకు ఇవ్వకుండా చేసినందుకు థాంక్ గాడ్ అండ్ .. మీలో కూడా అందరికి ఉద్యోగాలుంటే count ur blessings..!!

ఆ విసుగ్గా ఉన్న ఉద్యోగం వల్లే వచ్చిన డబ్బులతో mr.perfect సినిమా కి వెళ్ళాను కదా మొన్న..అప్పుడు ఇంటర్వల్ లో ఒక బర బర మని ఇనుప చక్రాల బండి శబ్దం ..ఇక్కడేంటి గోల అని ఒక్క సారి వెనక్కి తిరిగాను ...నేల మీద ఒకతను చిన్న పీట లాంటి దాని కింద చక్రాలు ఉంటాయి కదా ..దాని మీద ముందుకి వెనక్కి వెళ్తున్నాడు ..ఎందుకంటే దారి కదా ..అప్పటి వరకు ఆ దారి లోనే కూర్చుని చూసాడు సినిమా...ఇప్పుడేమో అందరూ స్నాక్స్ కొనుక్కోడానికి బైటికి లోపలికి వస్తూ ఇటు జరుగు అటు జరుగు అంటున్నారు పాపం ఒక్క నిమిషం కోపం వచ్చింది ..ఎందుకు ఇతనికి ఈ రోజే సినిమా చూడాలి అనిపించింది ఇంకో వారం పోయాక రావచ్చు గా అని ...కానీ వెంటనే నా మనసు నన్ను బాగా తిట్టేసింది ..ఛి ఛి నువ్వు కూడా ఇలా ఆలోచిస్తున్నావ ..??ఏ ఒక పక్క మబ్బులు.. ఇంకో పక్క మొదటి రోజు ... రద్దీగా ఉంటుందని తెల్సు ..అమ్మాయిలు తక్కువ ఉంటారు అని తెల్సు ..కానీ చూడాలనిపించి వెళ్ళావ్ ...అతనికి అంతే కదా ...ఏమో ఆ నిమిషం తెలీకుండానే నా కాళ్ళు చూస్కుంటూ థాంక్ గాడ్ అనుకున్నా ...

:) :) so count your blessings..!! :) :)

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...