ఆకాశవాణి : కిరణ్...ఒసేయ్ కిరణ్...
నేను : పొద్దున్నే ఎవరింత గౌరవం లేకుండా పిలుస్తుంది..??
నేనే వెన్నెల ని..
నేను : నువ్వు పొద్దున్నే వచ్చావ్ ఏంటి ..రాత్రి కదా రావాలి ..
వెన్నెల : నీ కుళ్ళు జోకులు వినే ఓపిక నాకు లేదు కానీ ...ఈ రోజేంటో గుర్తుందా ?
నేను : శుక్రవారం..రేపు వారాంతం.... :D
వెన్నెల : ఛా...రెండు సంవత్సరాల క్రితం .........
నేను : హా క్రితం...
వెన్నెల : ఇంకా గుర్తు రాలేదటే ..!!
నేను : లేదు..!!
వెన్నెల : మీ తమ్ముడికి కాల్ చెయ్....
నేను : పొద్దున్నే వాడికా ....ఎందుకు ??
వెన్నెల : వాడికైనా గుర్తుందేమో అని..
నేను : ఓయ్ నా తమ్ముణ్ణి వాడు... వీడు..అంటావ్ ఏంటి ...?
వెన్నెల : నువ్వు ఫోన్ కలుపెహే ..
నేను : ఒరేయ్ తమ్ముడు వెన్నెల నీతో మాట్లాడమంది ..
మా తమ్ముడు : బాగుంటుందా....నాన్నతో నువ్వే మాట్లాడేయి.. బాగుంటే ..నా పర్మిషన్ అవసరం లేదే..
నేను : ఛి ఛి వెధవ .. నా బ్లాగ్ వెన్నెల రా ...
మా తమ్ముడు : ఆదా ....
నేను : కికికికికికికికి ..
మా తమ్ముడు : ఏమంటా ?
నేను : ఈ రోజేదో ప్రత్యేకం అంట ..నిన్ను అడగమంది..
మా తమ్ముడు : ఎంత ఈ రోజూ తారీఖు ...
నేను : నవంబర్ నాలుగు
మా తమ్ముడు : కిరణ్ ..గుర్తొచ్చింది ...ఒకానొక రోజూ బుజ్జి చేత నామకరణం చేయించి నీ పలుకులు తీయగా ఉంటాయని అది భ్రమ పడటమే కాక ..నిన్ను కూడా భ్రమలో పడేసి thenepalukulu.blogspot.com అని ఒక బ్లాగ్ మొదలెట్టిన రోజూ ..నాకు నీ బ్లాగ్ inner voice వినిపిస్తోంది....
నేను : ఏమని??
మా తమ్ముడు : నేను పుట్టాను లోకం బెదిరింది..
నేను ఏడ్చాను readers నవ్వారు
నేను నవ్వాను readers ఏడ్చారు..
అయినా ఈ కిరణ్ కి వాళ్ల మీద జాలి లేదు....కిరణ్ dont care ..!!
నేను : దానిది లాగా లేదు..నీదే అనిపిస్తోంది.....సరే ఫోన్ పెట్టేయి ...
వెన్నెల : నాకు హ్యాపీ బర్త్డే చెప్పి ...అందర్నీ పిలిచి పార్టీ చెయ్యి ...
నేను : కుదరదమ్మా ..మన ఇంట్లో పుట్టినరోజులు అచ్చి రావు..మొదటి సంవత్సరం చేద్దాం అనుకున్నానా ....అప్పుడేమో నీకు ఇంకా మాటలు రావు కదా..ఎవరన్నా happy birthday అని చెప్పినా నేనే థాంక్స్ చెప్పాలి....ఎందుకు లే అని చేయలేదు ...అయినా చివరి నిమిషం లో చేద్దాం అని అనుకున్నాకా నీకు జ్వరం వచ్చింది ..బ్లాగర్ వాడే maintenance లో పెట్టేసాడు ...
వెన్నెల : కోయ్ కోయ్ ..కోతలు కోయ్ ....
నేను : నిజంగా నిజం .....సర్లే పోనీ ఈ సంవత్సరం గుండు కొట్టించనా ...??పద గుడికి పోదాం ...
వెన్నెల : ఎహే పో ..నేను అలిగాను ..
నేను : సరే ఉండు నీ అలక తీరుస్తా
ట్రింగ్ ట్రింగ్ ...
శైలు : హలో కిరణ్ బాగున్నావా ??
నేను : హా శైలు బాగున్నా..శైలు ఓ చిన్న పని ...
శైలు : ఏంటో చెప్పు...
నేను : అప్పుడు మనం పెట్టిన ఉత్తుత్తి ఛానల్ ఉందా ..??
శైలు : ఇప్పుడు దాని పేరు ఉత్తుత్తి కాదు ...సుత్తే సుత్తి ఛానల్ ..
నేను : అబ్బో ..బాగుంది ...మన డైరెక్టర్ వంశీ..,కెమెరా మాన్ రాజ్, anchor అప్పు ,script writer ఇందు లు అక్కడే ఉన్నారా .. ??
శైలు : హా..ఉన్నారు ....
నేను : సరే నన్ను , నా బ్లాగ్ ని ఈ రోజూ నీ ఛానల్ లో ఇంటర్వ్యూ చేయాలి ..
శైలు : ఓహో....ఒక సారి వంశీ ని,రాజ్ ని,అప్పు ని కనుక్కోవాలి ..
నేను : వాళ్ళెప్పుడు ఖాళీ నే లే ..నేను పిలిచా అని చెప్పు వచ్చేస్తారు ..
శైలు : నాది అదే భయం కిరణ్ ..నీ పేరు చెప్తేనే రారేమో అని ...
నేను : కోపం తెప్పించకు ..శైలు నాకు తెలీదు ఏం చేస్తావో ..ఇంటర్వ్యూ జరగాలి అంతే ....
శైలు : ఉండు ..వంశీ కి ఫోన్ చేస్తాను..వంశీ మధ్యానం మూడింటికి స్టూడియో కి రా ...
వంశీ : ఎందుకు ...?మూసేస్తున్నామా ఛానల్ ..??జీతం సెటిల్ చేస్తావా ..?
శైలు : కాదు కిరణ్ ని , కిరణ్ బ్లాగ్ ని ఇంటర్వ్యూ చేయాలంట ..కాస్త ప్రోగ్రాం ని డైరెక్ట్ చేద్దువు రా
వంశీ : ఎందుకు కిరణ్ బ్లాగ్ లోకానికి వీడుకోలా ...??? అయితే మనకి సంబరాలే ....టపాకాయలు కూడా తెచ్చేస్తా ..
శైలు : కిరణ్ కూడా line లో ఉంది ...
వంశీ : ముందే చెప్పాలి కదా శైలు...కిరణ్.... ఊరకే సరదాకి అన్నాను లే ....నేను నీ ప్రోగ్రాం ని హిట్ చేస్తా ..వచ్చి డైరెక్ట్ చేస్తా...
నేను : సరే ప్రశ్నలు బాగుండాలి...నన్ను ,నా బ్లాగ్ ని బాగా promote చేయాలి .....పొగడాలి..
శైలు : సర్లే నువ్వు మంచి డ్రెస్ లో రా..
నేను : సరే ఆ రాజ్ ని తుప్పట్టిన కెమెరా కాకుండా మాంచి కెమెరా తీసుకురమ్మని చెప్పు ...
శైలు : కిరణ్ రాజ్ కూడా line లో నే ఉన్నాడు ...
నేను : ఏంటి కొత్తగా BSNL వాడి దగ్గర కాంట్రాక్టు తీస్కున్నావా ..అందరికి ఫోన్ లు కలిపేసి పండగ చేస్తున్నావ్ ..
శైలు : అదేమీ లేదూ లే...నువ్వోచ్చేయ్ ..
నేను : అన్నట్లు ఆ అప్పు ని సగం సగం తెలుగు కాకుండా ....మంచిగా తెలుగు మాట్లాడమను..
ఇందు,శైలు,వంశీ,రాజ్ : నువ్వు సరిగ్గా మాట్లాడు ముందు ..
నేను : ఏంటి అందరూ ఒకటే సారి..??
సరేలే ...కర్రెస్ట్ గా మూడింటికి ఉంటా..
*********************************************************
మూడింటికి స్టూడియో లో......
****************************************************8****
అందరూ నా స్నేహితులే అయినా..చణువు తో తింగరి ప్రశ్నలు అడుగుతుందేమో అప్పు అని లోలోపల ఒక భయం..మరి ప్రశ్నలు తయారు చేసింది ఇందు కదా..ఆ రాజ్ నన్ను కాకుండా పక్కనే ఉన్న నిత్య ఫోటో ని షూట్ చేస్తాడేమో అని ఇంకో అనుమానం..
ఇలా అనుకుంటున్నంతలో రాజ్ నా దగ్గరికొచ్చి కెమెరా నే చూస్తూ మాట్లాడు..అప్పుడప్పుడు అప్పు ని కూడా చూడు...అని చెప్పి వెళ్ళిపోయాడు ..అసలు నేను ఇంక రాజ్ చెప్పిన మొదటి మాట మాత్రమే విన్నాను...మీకర్థంయ్యింది కదా...!!
రాజ్,వంశి ఇంటర్వ్యూ మధ్యలో ఎవ్వరికి వినపడకుండా అప్పుడప్పుడు గుసగుసలాడుకుంటారు..
ఇంటర్వ్యూ మొదలు
అయ్యింది ...
అప్పు : కిరణ్ మీరు స్టూడియో కి ఎందుకు వచ్చారు ?
నేను : వెర్రి చూపులు ...ఇందు ని మింగేలగా చూస్తూ...
వెంటనే అప్పు : షాక్ అయ్యారా ..??..సరదాకి అడిగాను ..మాకు కారణం తెలుసు లెండి..
నేను : అప్పటికే నా తెల్ల డ్రెస్ చెమటల వల్ల సగం నల్లగా అయిపోయింది...
అప్పు : మీరు బ్లాగ్ మొదలు పెట్టి రెండు సంవత్సరాలు అవుతోంది అంటే ఆశ్చర్యంగా ఉంది..
రాజ్ ,వంశీ : అవునవును ....అప్పటి నుండి భరిస్తున్నాం అంటే
ఆశ్చర్యమే మరి..
నేను : :)
అప్పు : ఎలా మొదలయ్యింది మీ బ్లాగ్ ప్రయాణం ?
నేను : అసలైతే నాకు బ్లాగుల గురించి తెలీదు ..ఓ రోజూ మా తమ్ముడు చూపెట్టాడు ..ఎవరివో బ్లాగ్స్..అందులో కొన్ని ఆర్ట్ బ్లాగ్స్ కూడా చూపించాడు ..అప్పుడు అడిగాను ...నేను కూడా నేను వేసిన బొమ్మలు పెట్టుకోనా అని ...మేము మాత్రమే ఎందుకు బలి కావాలి ..ప్రపంచం లో ఎవరెవరు బలికానున్నారో ..పెట్టుకో అన్నాడు..అలాగే అని కాస్త కూడా ఆలస్యం చేయకుండా మొదలెట్టేసాను...
అప్పు : ఓహ్ ...మీ మొదటి బ్లాగ్ బొమ్మలదా..??
నేను : అవును ఆర్ట్ బ్లాగ్ ..
అప్పు : ఎప్పటి నుండి బొమ్మలు వేస్తున్నారు ...మీకు అసలు బొమ్మలు వేయాలని ఎందుకు అనిపించింది ..?
నేను : ఏడో తరగతి లో మా స్నేహితులు అంతా మిక్కి మౌస్ బొమ్మలు వేస్కుంటున్నారు....నేనేమో అప్పుడే బఠానీలు కొనుక్కుని జేబు నిండా వేసుకుని ...తినేసి ...శబ్దం లేకుండా గురక పెడుతూ బెంచిలో నిద్రపోతున్నా ..ఇంతలో మా సర్ వచ్చి ..బెంచి నీ సైజు కి సరిపోయిందని అడ్డంగా పడుకుని నిద్రపోతావా ..లేచి సోషల్ చదువు ..లేకపోతే వాళ్ల లాగా బొమ్మలేస్కో అన్నారు .....బొమ్మలే బెటర్ అని..నేను ఓ పెన్సిల్ తీస్కోని ..సోషల్ టెక్స్ట్ బుక్ తీసి వెనక వైపుకి తిప్పి మిక్కి మౌస్ గీసాను ...అందరూ కిరణ్ కేక ....కెవ్వు అన్నారు ....అంటే వాళ్ళవి కూడా నేను కేక కెవ్వు అన్నాను కదా మరి...వాళ్ళు మిక్కి మౌస్ తో ఆపేసారు ...నేను డోనాల్డ్ డక్ ని వదలలేదు ..ఆ తర్వాత చీమ, దోమ,వినాయకుడు,మహేష్ బాబు....ఇలా కిరణ్ చేతిలో బొమ్మ కావడానికి ఏది అనర్హం కాదు...అనేలా ఎదిగాను..
రాజ్,వంశీ.. : వాళ్ల సోషల్ సర్,వాళ్ల ఫ్రెండ్స్ ఎక్కడున్నా వెతుక్కుంటూ వెళ్లి చితక్కోట్టేయాలి...
అప్పు : అవునా మరి మహేష్ బాబు బొమ్మ ఎక్కడ కనపడలేదే ...
నేను : ఎప్పుడో ఎనిమిదేళ్ళ క్రిందట గీస్తే వాళ్ళ నాన్న కృష్ణ లాగా వచ్చాడు ..ఇప్పుడు గీస్తుంటే కూడా అలాగే వస్తున్నాడు .. మహేష్ ముసలాడు అవుతున్నాడేమో ..నేను ఆర్ట్ లో improvement చూపించినా తన మొహం లో కూడా ముసలి కళ పెరుగుతోందేమో ...త్వరలో ..గీసి మీ ముందుకు తీసుకొస్తా ...
రాజ్ : అవసరం లేదూ ..మీ వెనకే పెట్టుకోవచ్చు ...
అప్పు : మీరు బొమ్మలు గీయటం లో మరిన్ని మెళకువలు
నేర్చుకొని ....ఎంతో మంచి కళాకారిణి కావాలని ..ఉన్నత
శిఖరాలు అధిరోహించాలని .....కోరుకుంటున్నాం ..
రాజ్ : ఇంత తెలుగు కిరణ్ కి అర్థమవుతుందంటావా ??
వంశీ : నాకు డౌటే ...ఆ కళ్ళల్లో చూడు ..నీళ్ళు వస్తున్నాయ్ ..అర్థం కాలేదనుకుంటా ..!!
అప్పు : మీ కోసం ఒక surprise ...!!..అటు చూడండి ..!!...
పక్కనే టీవీ ఆన్ చేసారు ...బొమ్మ రావట్లేదు ..గొంతు వినిపిస్తోంది ...
నేను : అయ్ ..మా బుజ్జి గొంతు :D
బుజ్జి : కిరణ్ నా ఫ్రెండ్ ఆ కాదా...అని ఆలోచించుకునే లోపే అది నా పక్కకి వచ్చేసి..బుజ్జి నా ఫ్రెండ్ అని చెప్పేసుకుంటుంది..ఇదో పెద్ద తింగరి ది..ఎప్పుడు ఏ తింగరి పని చేస్తుందో దీనికే తెలీదు..ఎలాంటి స్నేహితురాలంటే..ఐస్ క్రీం తినే ముందు రావే వెళ్లి తిందాము అని పిలవదు...తినేసి ఆ కప్పు కి ఫోటో తీసి నాకు చూపిస్తుంది... బ్లాగ్ మొదలు పెట్టినపుడు ..నా బ్లాగ్ కి పేరు పెట్టో అని మొత్తుకుంటే తేనేపలుకులు అని సలహా పడేసా ....ఆ తర్వాత ఇది పని లేనప్పుడల్లా ఓ టపా రాసి కామెంట్ ఎట్టవే అని నాకు ఓ మెయిల్ పడేసేది ...కాస్త వేరే వాళ్ళు చదవడం మొదలెట్టాక నన్ను వదిలేసిందనుకుంటే ...నా మీదే టపా పడేసింది ....కిరణ్ బ్లాగ్ చదువుతున్న వారందరికి నాది ఓ చిన్న విన్నపం..మీరు ఎప్పటికి ఇలాగే దాని బ్లాగ్ చదువుతూ ఉండండి ..కామెంట్ పెడ్తూ ఉండండి ..నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి ...టాటా కిరణు ..లవ్ యు కిరణు ...
అప్పు : మీ కోసం మళ్లీ వీడియో రికార్డింగ్ ఎందుకని ఆడియో రికార్డింగ్ చాలని ఛానల్ owner శైలు అన్నారు అందుకే ఇలా ...
నేను : శైలు కి ఈ మధ్య నేనంటే అస్సలు భయం లేకుండా పోయింది...!!...అయిన సరే థాంక్ యు వెరీ మచ్...!!
రాజ్ ,వంశీ : ఒకరి మొహాలు ఒకరు చూస్కొని ఏమిటో ఈ కిరణ్ కి పొగడ్తకి ..తిట్టుకి కూడా తెలీదు అన్నట్లు మొహాలు పెట్టారు ..
అప్పు : అవును తేనేపలుకులు ఎందుకు మొదలెట్టారు ...
నేను : పైత్యం ఎక్కువయ్యి ...
అప్పు : వెర్రి చూపులు
నేను : నవ్వి .. అలా కాదండి...ఒకానొక రోజున తోటరాముడి గారి బ్లాగ్ కనపడింది..నేను ఆయన టపాలని భలే చదివేదాన్ని..రోజూ కి ఒకటి డ్యూటీ లాగా చదివినవే మళ్లీ చదివే దాన్ని..కొన్ని రోజులయ్యాక నేస్తం గారివి చదివాను....డిట్టో అలాగే...మూతికి చున్ని అడ్డం పెట్టుకుని ...శబ్దం బయటికి రాకుండా కికికికికికికికి అని...ఒకొక్క సారి ఊపిరాడకుండా పోయేది ...ఆ కికికి ని దగ్గు గా మార్చి ఏమి జరగనట్లు మొహం పెట్టి..మధ్యలో కాస్త బయటకెళ్ళి ...ఎవరకి కనపడకుండా గట్టిగా నవ్వుకుని ...ఊపిరి పీల్చుకుని వచ్చి చదివేదాన్ని ...ఇలా చదవడం తో ..ఎక్కడో నాలో ఉన్న రచయిత్రి నిద్ర లేచింది ..నేనూ ప్రయత్నిస్తా అంది ...గూగుల్ వాడు ఇంకా బ్లాగు కి వెయ్యి అనే కాన్సెప్ట్ మొదలెట్టలేదు కాబట్టి నువ్వు పండగ చేస్కో అని నాకు నేను చెప్పుకుని మొదలెట్టాను ..ఆ తర్వాత మీరందరూ బలయ్యారు..
అప్పు : వేరే వాళ్ళ బ్లాగ్స్ చదివినప్పుడు ఎలా ఫీల్ అవుతారు..??
నేను : ఒక్కొక్కరి భావుకత ఒక్కో రకం...ఒక్కోసారి....కిల కిల నవ్వితే..ఒక్కో సారి మనసంతా భారంగా అయిపోతుంది ..ఒక్కో సారి ఎప్పుడో కలిసిన పాత మిత్రులని కలిసి బోలెడు కబుర్లు ..విశేషాలు ..పంచుకున్నట్లుంటుంది ....మొత్తానికైతే ఒంటరితనం అన్న మాటే మర్చిపోతాం ..
అప్పు : బ్లాగులో నేస్తాలున్నారా ??
నేను : ఎందుకు లేరు మొదట్లో గారు గారు అంటూ పిలిచినా ..ఆ తర్వాత పరిచయమయ్యాక నువ్వు అని పిల్చుకునే చణువు వరకు వచ్చేసాం ..చాలా బాగుంటుంది e-స్నేహం కూడా ...ఒక్కో సారి వారం రోజులు ఎక్కడా కనపడకపోతే...ఎలా ఉన్నావ్ అంటూ వచ్చే పలకరింపులు ఎంత ఆనందాన్నిస్తాయో చెప్పలేం ..
అప్పు : కళ్ళల్లో నీల్లోస్తున్నాయ్ ..మీ మాటలు వింటుంటే (శైలు ,ఇందు కూడా curtain వెనకాల నుంచోని ఏడుస్తున్నారు ...)
వంశీ : ఎహే ..నేను డైరెక్ట్ చేసేది సీరియల్ కాదు ...ఏడవకండి ...ఇందాకే glycerine రాసేస్కున్న్నారా ...???
అప్పు : సరే మీకు మళ్లీ ఓ surprise ...ఈ సారి కూడా ఆడియో రికార్డింగ్ ఏ ..కానీ స్పెషల్ ఎఫ్ఫెక్ట్ టీవీ లో మా తమ్ముడి ఫోటో కనిపిస్తోంది ..
నేను : అమ్మో వీడా ..ఏమేమి నిజాలు చెప్పేస్తాడో ...
నా తమ్ముడు : పోన్లే బ్లాగ్ మొదలు పెట్టుకుంటే ఇంటికి వచ్చినప్పుడల్లా టీవీ కోసం ,నేను చదివే నోవెల్ కోసం పోట్లాడదనుకుంటే సిస్టం కోసం పోట్లాడుతోంది ...సరే అక్కే కదా అని encourage చేస్తే ...తమ్ముడు ఈ టెంప్లేట్ పెట్టివ్వు ...ఆ టెంప్లేట్ పెట్టివ్వు అని ఓ నస పెట్టేసేది...ఆ రంగు ఈ రంగు పెట్టమని గోల ....కుదరదే తింగరి అంటే వినేది కాదు ..ఫైనల్ గా ఓ చందమామని తీస్కొచ్చి వెనకాల పెట్టాక శాంతించింది ....మీరు నిరంతరంగా మా అక్క బ్లాగ్ చదివి నాకు అంతరాయాలు కలగకుండా చేస్తున్నందుకు మీకు బోలెడు ధన్య వాదములు ...
నేను : అంతా వాడి అభిమానం ..కళ్ళు తుడుచుకుంటూ
అప్పు : మీరు ఇలాగే సరదాగా కబుర్లు చెప్తూ ..బ్లాగులో బోలెడు టపాలు రాయాలని ..మీ బ్లాగ్ స్నేహితులతో స్నేహం ఎప్పటికి కలకాలం ఉండిపోవాలని కోరుకుంటున్నాం ..
నేను : thank u very much....thanks a lot...
అప్పు : చివరిగా మీ బ్లాగ్ readers కి ఎమన్నా చెప్పాలనుకుంటున్నారా...??
నేను : నా బ్లాగ్ లో రాసే ప్రతి టపా..చదివి ప్రోత్సహిస్తున్న మీ అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు.. ఒకొక్కప్పుడు దిగులుగా ఉన్నా...మనసు బాలేకపోయినా నేను రాసిన టపా కి వెళ్లి దాని కింద కామెంట్లు చదువుకుంటే చాలా సంబరంగా ఉంటుంది...!!
అప్పు : మా స్టూడియో కి వచ్చినందుకు మీకు బోలెడు ధన్యవాదములు ....మా అందరి తరఫున మీ బ్లాగుకి పుట్టిన రోజూ శుభాకాంక్షలు ...
నేను : ఓయ్.. వెన్నెల చూడవే .....నీ birthday celebrations...
అప్పు : ఉండండి కేకు తెచ్చాము ....
శైలు : హా కిరణే ఇందాక ఫోన్ లో అడిగింది ...కేకు కూడా కట్ చేయించండి అని ...
నేను : నమిలి,మింగేసేలా చూస్తూ
శైలు ,వంశీ ,రాజ్ ,అప్పు ,ఇందు ,నేను :
happy birthday to u...
happy birthday to u...
happy birthday to u...vennela....:)
నేను : thank you so much again...!! :)
రాజ్ : ఒక్క ఫోటో చివరిగా ..మీ బ్లాగ్ తో మీకు ...
నేను : అలాగే
రాజ్ : క్లిక్ ...క్లిక్ ...క్లిక్ ..
నేను : ఇంతకీ ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారు ..??
రాజ్ : ఏంటది ...
నేను : ఇప్పుడు మీరు వీడియో తీసింది ...??
రాజ్ : వీడియో ఎవడు తీసాడు ??అంతా ఫొటోలే ...అది కూడా ఇందాకటి నుండి నటన....ఇప్పుడే ఒక్క ఫోటో తీసాను ...రీళ్ల కెమెరా...డిజిటల్ ది ....వేరే బ్లాగర్ వస్తేను అటు పట్టుకుపోయారు..ఒక్క ఫొటోనే మిగిలుంది .....అదే ఇప్పుడు మీకు తీసాం ...
నేను : వాఆఆఆఆఅ..వాఆఆఆఆఅ...వాఆఆఆఆఅ....
శైలు : కిరణ్ అలా ఏడవకు ....ఇదంతా నీ బ్లాగ్ లో నే రాసుకో ......అందరూ చదివి దీవిస్తారు ...
నేను : గుడ్ ఐడియా శైలు ....టాటా :D
ఇందు : కిరణు..కిరణు....నీకు బోలెడు థాంకులు....ప్రశ్నలే కాక జవాబులు కూడా నాతోనే రాయించుకున్నావ్...ఎక్కడ సరిగ్గా పలకవో అని కాస్త కంగారు పడ్డాను...పర్లేదు...బానే మేనేజ్ చేసావ్...
నేను : ఇప్పుడు ఆ విషయం అందరికి తేలియాలా
?? ..బాయ్ ఇందు..!!
పిల్లలు...శైలు,అప్పు,ఇందు,రాజ్,వంశీ...మీకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు గాను...నాకు పార్టీ ఇచ్చేయండి :P