4 July 2012

మీరంతా ఆహ్వానితులే ... :)

నేను వంట చిన్నప్పుడే చేసేదాన్ని...చిన్నప్పుడంటే B.Tech లో ఉన్నప్పుడు... మా అమ్మ ఊర్లో ఉన్నప్పుడు ఎప్పుడూ వంటింట్లోకి వెళ్ళిన పుణ్యానికి పోలేదు...నాకు మా అమ్మ అంటే అంత గౌరవం...తాను చేస్తుండగా..నేను వెళ్లి నీ పని నేను చేస్తా అంటే ..పాపం నా పని సరిగ్గా లేదేమో అని అమ్మ మనసు నొచ్చుకుంటుంది కదా..ఇలా అన్ని రకాలు గా అలోచించి..వంటింట్లో కి కూడా వెళ్ళకుండా...హాల్ లో నుండే నీళ్ళు అడిగేదాన్ని...ఒక్కోసారి చేతికొచ్చేవి...ఒక్కో సారి మొహాన పడేవి...అది మాతృ దేవత మూడ్ ని బట్టి ఉంటుంది..!!అయినా ఏవండోయ్...ఏనాడు వంటింట్లోకి వెళ్ళేదాన్ని కాదు...!!

అమ్మ అమ్మమ్మ కి వంట్లో బాలేదనో..తాతయ్యకి జ్వరంగా ఉందనో..పిన్ని రాక రాక పుట్టింటికి వచ్చిందని చూడటానికి వెళ్తేనో..నా పెతాపం బైట పడేది..కొన్ని రోజులు నాన్న చేసేవారు...తర్వాత అమ్మతో  తిట్లు తినేవారు..."బాగుంది...అన్నీ మీరు చేస్కుంటే దానికేప్పుడు పని వచ్చేది...వదిలేయండి..వచ్చీ..రానీ వంటలు పనులు చేస్కుంటేనే కదా మనం ధైర్యంగా ఇంకో ఇంటికి పంపగలం"..అంటే..అప్పట్లో ఏమనుకునే దాన్నంటే..దీనికి ఉద్యోగం రాకపోతే కనీసం ఈ పని కైనా పంపిద్దాం అనుకున్నారేమో అనుకునే దాన్ని...పిచ్చి మొహాన్ని...అసలు మెయిన్ కాన్సెప్ట్ అర్థమే అయ్యేది కాదు...నాన్న కూడా అమ్మ మాటలు మనసు మీదకి తీస్కోని....వంటిట్లోకి రావడం మానేస్తే నేను బెడ్రూం లో కి కూరలు ..బియ్యం..చపాతీ పిండి తీస్కోచ్చేదాన్ని...నాన్న వీటితో మీకు ఏదోస్తే అది చేయండి..గ్యాస్ స్టవ్ కూడా ఇక్కడికే తీసుకొస్తా అని...మా నాన్న కొంచెం కూడా మొహమాటం లేకుండా ఆ సదవకాశం నీకే ఇస్తున్న...ఏదోస్తే అది నువ్వే చెయ్యి అన్నారు... కన్నీళ్లు ఆగక బియ్యం పోసుకోచ్చిన గిన్నెలోనే పడ్డాయి....ఆ నీటితోనే బియ్యం కడిగి అన్నం వండాను....తర్వాత బెండకాయలు కసాబిసా  లెక్కగా  కోసేసి....లెక్కంటే..నాకు రెండు..తమ్ముడికి రెండు..నాన్న కు నాలుగు బెండకాయలు..మళ్లీ మధ్యలో పుచ్చులు వచ్చేవి ...నాకేమో అసలే అనుమానం...అన్నీ తరిగిన తర్వాత ఒక భూతద్దం తీసుకొచ్చి ఆ అరవై ముక్కల్ని నెమ్మది గా చూసేదాన్ని...అరవై ఎలా అంటే...ఒక్కో బెండకాయని ఆరు ముక్కలు గా స్కేలు పెట్టుకుని సమానంగా కోసేదాన్ని....ఒక్కో సారి..చిరాకువేసి ...ఒక్క  సారిగా dettol తీసుకొచ్చి కడిగేస్తే ఓ పనైపోతుంది అనిపించేది..కానీ నేను కూడా టీవీ చూస్తాను కదా...అందులో దాన్ని బాత్రూం లో మాత్రమే వాడటం చూపించడం వల్ల దాన్ని వంటింట్లో కి తెచ్చే దాన్ని కాదు :P ..
సరే ..నా పరిశీలన అయ్యాక  వాటిని నూనె లో టకా టకా వేయించి ..ఉప్పు..కారం జల్లేసి...ఏ వాసన రాకపోతే కాస్త  ఇవ స్ప్రే దాని మీద చల్లి...చారు చేసి....వాసన కోసం ఈ సారి ఇంగువ చల్లి....మొట్ట మొదటి సారిగా వండినందుకు దేవుడికి నైవేద్యం పెట్టి...దేవుడి నోరు ఓ బట్టతో కట్టేసి....(అటు గట్టిగా అరవకుండా..ఇంకో వైపు దాన్ని ఎలాగైనా ఆయన పొట్ట లోకి వెళ్లేందుకు..)..నాన్న కి ,తమ్ముడికి బాక్స్ లు కట్టేసి..నేను మాత్రం బ్రెడ్ ,జాం పట్టుకెళ్ళి...పొద్దున్న బ్రేక్ లో అవి ముగించేసి...మధ్యానం..ఖాళీ గా కూర్చుంటే..పాపం కిరణ్ వాళ్ల అమ్మ ఊరు వెళ్ళింది  అని జాలి పడి ఒకరు..బియ్యపు రొట్టె విత్ నూనె వంకాయ కూర..ఒకరు ఫ్రైడ్ రైస్...ఇంకొకరు పులిహోర పెడ్తుంటే..ఆహా..ఓహో...ఇప్పుడు మీకేదో సామెత గుర్తు వస్తోందే...నా మాట విని మర్చిపోండి... :P

                                          సాయంత్రం ఇంటికి రాంగానే ఎలా ఉంది అని కూడా అడగను...తండ్రికన్నా ...పుత్రికోత్సంబు ఉంటుంది...తమ్ముడికి ఉన్న ఉత్సాహం కూడా పోయుంటుంది కాబట్టి..ఏ క్రికెట్ బాట్ పెట్టో  నెత్తి మీద కొట్టాడంటే..వద్దులే ..మీరంతా ప్రశాంతంగా ఉంటారు :P .కాని నాన్న నేను మళ్లీ సాయంత్రం వంట చేస్తున్నప్పుడు నెమ్మది గా వచ్చి..స్టవ్ సిం లో పెట్టుకుని వండు అన్నారు...ఇప్పుడేమో బంగాలదుంపలు ...పొద్దున్న చారే..వేడి చేశా అన్నమాట...ముగ్గురం ఒకే చోట కూర్చుని తినాలి..కానీ నాకేమో మీకు తెల్సినట్లే సిగ్గెక్కువ కదా..."నాన్నా.. మళ్లీ తింటా" అంటే...మూడో కంచం నా వైపు తోసారు.... :(

                                    ఆ రోజూ నేనూ, తమ్ముడూ..దేనికోసమో పిచ్చి పిచ్చి గా కొట్టుకుని మాట్లాడుకోవట్లేదు...మా ఇద్దరినీ తిట్టి నాన్న కూడా చాలా సైలెంట్ అయిపోయి...పెద్ద దానివి...ఆడ పిల్లవి ..వాడితో సమానంగా పోట్లడుతావ్....సర్డుకోవద్దు అని స్వరం పెంచారు...నోట్లో ఒకొక్క ముద్దా పెట్టుకుంటూనే  వెక్కి వెక్కి ఏడుస్తున్నా...వాళ్ళిద్దరూ ఎప్పుడో  అయిపోగొట్టి వెళ్ళిపోయారు..కానీ నా తిండి అవ్వట్లేదు...ఇక మా తమ్ముడుం గారికి కోపమొచ్చి..నువ్వు కనీసం నాన్న తిట్టిన సాకు పెట్టుకునైనా నీ తిండి తినలేక ఏడుస్తున్నావ్..మరి మా బాధ ఎవడితో చెప్పుకోవాలి..అని గట్టిగా అరిచాడు..దుఃఖం ఇంకా ఎక్కువై...ఇంకో సారి అక్కయ్యా..వంట చేయాలంటే నువ్వే చేయాలి అనేలా పేరు తెచ్చుకోవాలని కలలు కంటూ నిద్దరోయాను..

అమ్మ వచ్చాక..పర్లేదు బానే ఉంది దాని వంట అని ఇద్దరూ చెప్పడం తో..TL అప్ప్రైసల్ టైం లో మేనేజర్ కి ఇచ్చే ఫీడ్ బ్యాక్ లాగ ఫీల్ అయ్యి ఆనందపడ్డాను..లేకపోతే మీకు ఈ పాటికి కిరణ్ సహస్త్ర నామావళి అనే పుస్తకం అందుబాటులో ఉండేది...

మా అమ్మ నా మీద నమ్మకం తో తరచూ గా ఊరు వెళ్ళడం  మొదలెట్టింది...మా తమ్ముడు ,నాన్న కూడా ..తరచూ గా బాధ పడటం అలవాటు చేస్కున్నారు...
ఒకటో సారి - పొద్దున్న బ్లాక్  బెండకాయ్..సాయంత్రం బ్రౌన్ బంగాల దుంప....రెండు పూటలా ఒకే రెడ్డిష్ బ్రౌన్ చారు..
రెండో సారి - అవే..
మూడో సారి - డిట్టో
నాలుగో సారి - మీకు తెల్సు..!! :P

ఏదో ఒక సారి మా తమ్ముడు స్కూల్ కి వెళ్తూ వెళ్తూ ...వాళ్ల ఫ్రెండ్ ఇంటికి వెళ్లి ..అక్కడి నుండి వాడితో వెళ్దాం అని అటు వెళ్ళాడు...ఆ ఫ్రెండ్ వాళ్ల అక్క నా ఫ్రెండ్..
ఏం రా మీ అక్క ఏం చేస్తోంది..??
ఇప్పుడే నాకు..నాన్నకు బాక్స్ కట్టించింది..అక్కా..ఇంకా టిఫిన్ తిని కాలేజీ కి వస్తుంది..
మరి మీ అక్క తెచ్చుకోదు కదా బాక్స్...
ఓహ్ అవునా..ఏమో అక్కా మరి..(అమ్మ దొంగ మొహమా!!)
సరే పైకి రా....వాడు ఇంకా షూస్ వేస్కోవాలి..
లేదక్క..సైకిల్ కి కార్రియర్ ఉంది కదా......కోతులు ఉన్నాయ్..కిందే వెయిట్ చేస్తాం లే..
సరే......అయ్యో కోతి..కోతి..
అయ్యయ్యో...అక్క పెట్టిన  కూర అంతా పడిపోయిందే....
అదేంటి రా..అవి ఆ కలర్ లో ఉన్నాయ్...
బెండకాయలు అక్క..
అవి పచ్చగా కదా ఉంటాయి..
మా అక్క చేస్తే నల్లగానే వస్తాయ్ అక్కా..
ఎలా తింటున్నవ్?
ఎవడు తింటున్నాడు...చూసావా...కోతులు కూడా దగ్గరికి రావట్లేదు..
ఓహో..సరే..వెళ్ళండి...

అది కాలేజీ కి వచ్చి అందరికి చెప్పి చెప్పి నవ్వింది దొంగ మొహం ది :(

ఇంకో సారి మా తమ్ముడు ఊర్లో లేడు..నేను,నాన్న మాత్రమే ఉన్నాం...ఈ రోజూ శనివారం...నువ్వు టిఫిన్ చెయ్యి కిరణ్ అంటే..పాపం ఎప్పుడూ ఉప్మా నే వద్దు..నాన్నకు పూరి చేసి పెడతాం అని సూపర్ ఫాస్ట్ గా చేసేసి...నాన్నకు టిఫిన్ ఇచ్చి ..పక్కనే మూడు చెంబుల నీళ్ళు పెట్టి..రెండు గదుల అవతల కూర్చుని....కంగారు కంగారు గా..పుస్తకం తిరగేసి పట్టుకుని.....చదువుకుంటున్నా....ఈ లోపల కరుం కరుం అని శబ్దం..ఏమిటి ఇవి బాలేక పప్పు చెక్కలు(నిప్పట్లు) లాంటివేమన్నా  తింటున్నారేమో అనుకుని తలుపు చాటున నుంచుని చూస్తే ..అవి మనం చేసిన పూరిలే...నవ్వాగలేదు...కాని నవ్వలేను..ఎలా ఉన్నాయని అడగలేను....
మళ్లీ నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకుని...అమ్మ కోసం ఎదురు చూసి రాంగానే చెప్తే..అమ్మ కాసేపు నవ్వి...చూడు...మరి..వంట రావాలి కదా..అని స్వరం మార్చే లోపు...అమ్మా అన్నట్లు స్నేహ ఏదో చదువుకుందాం రమ్మంది అంటూ సైకిల్ తీసేసా..!!

ఇంత టపా చదివిన మీ అందరికి మా ఇంట్లో విందు భోజనం...మీరంతా ఆహ్వానితులే ... :)
Posted by Picasa

అనన్య చురకలు !

మా పాపా పేరు అనన్య  ఇది చిన్నప్పటి నుండి చాల shocks ఇచ్చింది నాకు ...గుర్తున్నవి సరదాగా ఇక్కడ రాస్తున్నాను  దీనికి 2.5 ఏళ్ళకి ప్లే స్కూల్ లో...